షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత
ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో పాటు వృద్ధాప్య భారంతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, బుధవారం రాత్రి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించినట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు, అభిమానులు ఆమె త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
షావుకారు జానకి ప్రస్థానం
1931 డిసెంబర్ 12న జన్మించిన జానకి గారు, 1950లో ఎన్‌టీఆర్ కథానాయకుడిగా వచ్చిన 'షావుకారు' సినిమాతో సినీ రరంగప్రవేశం చేశారు. ఆ తొలి చిత్రమే ఘనవిజయం సాధించడంతో ఆమె పేరు 'షావుకారు జానకి'గా స్థిరపడిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసిన ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.
