టీబీ నిర్మూలనకు జోష్ టీమ్ ఏర్పాటు అవగాహనతో పాటు బాధితులకు సహకారం అందించడమే లక్ష్యం
అనంతపురం బ్యూరో : టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జోష్ టీమ్ లాంచింగ్ కార్యక్రమాన్ని గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా నుంచి వర్చువల్‌గా వీక్షించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జోష్ టీమ్‌లో 11 మంది సభ్యులు ఉంటారని, ఒక క్లాస్-1 నోడల్ అధికారితో పాటు ఐదుగురు ఎన్‌సీసీ విద్యార్థులు, ఐదుగురు మై భారత్ వాలంటీర్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. టీబీపై ప్రజలకు అవగాహన కల్పించడం, బాధితులకు అవసరమైన సహాయం అందించడం, నిక్షయ్ మిత్రలుగా సైకో-సోషల్ సపోర్ట్ అందించడం ఈ టీమ్ ప్రధాన లక్ష్యమన్నారు.
టీబీ రోగులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చికిత్స సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న వారితో టీబీ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి డాక్టర్ జయలక్ష్మి, వైద్య కళాశాల నుంచి డాక్టర్ అశోక్ కుమార్, ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు, టీబీ చాంపియన్స్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.