ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌లో భారతీయులు ఆస్తులను ఎందుకు ఎక్కువగా కొంటున్నారు

business |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 10:40 PM

దుబాయ్‌లో ఇళ్లు, ప్రాపర్టీలు కొనడం లాంటివి ఒకప్పుడు కేవలం ధనవంతులు చేసే వ్యవహారాల్లాగే భావించేవారు చాలా మంది. కోటీశ్వరులు, బాలీవుడ్ తారలు, పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఇలాంటివి చేస్తారని అనుకునే వారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భారత్‌లోని మధ్యతరగతి వేతన జీవులు కూడా ఆ కలల ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. దుబాయ్‌లో వివిధ రకాల ఆస్తుల పట్ల భారతీయ కొనుగోలుదారుల ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ప్రాపర్టీలు.. భారతీయులను ముఖ్యంగా మధ్యతరగతి వారిని ఎందుకు ఆకర్షిస్తున్నాయి? వాటికి కారణాలేంటి? ఇక్కడితో పోలిస్తే దుబాయ్‌లో ఏమైనా రాయితీలు ఇస్తున్నారా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


తక్కువ వడ్డీ రేట్లు, ఫైనాన్సింగ్ ఖర్చులు


దుబాయ్‌లో.. భారతీయ మధ్యతరగతి కొనుగోలుదారులు సుమారు 5% వడ్డీ రేట్లతో ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో ఇది సుమారు 10% ఉంటుంది. తక్కువ వడ్డే రేటుతో ఆర్థిక భారం, EMIల మొత్తం తగ్గుతుంది. దీంతో కొనుగోలుదారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉండటానికి వీలు కలుగుతుంది.


భారతదేశంలో పన్నులు నికర రాబడిని తగ్గిస్తాయి. కానీ దుబాయ్‌లో అద్దె ఆదాయం లేదా ఆస్తి అమ్మకాలపై ఎలాంటి ఆదాయపు పన్ను లేదా మూలధన లాభాల పన్ను ఉండదు. దీంతో పెట్టుబడిదారులకు నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది.


ఫ్లెక్సిబుల్ చెల్లింపు ప్రణాళికలు, లోన్ ఆప్షన్లు


దుబాయ్.. తక్కువ లేదా సున్నా వడ్డీతో ఆఫ్-ప్లాన్ పేమెంట్ ఆప్షన్లను ఇస్తుంది. అంతేకాకుండా దాదాపు 20-25% డౌన్ పేమెంట్‌తో దుబాయ్ బ్యాంకుల నుంచి 3.5%-4.5% వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ పొందొచ్చు.


ప్రాపర్టీ ధరలు


దుబాయ్‌లో ప్రైస్-టు-ఇన్‌కం రేషియో చాలా ఎక్కువగా ఉంది. అంటే సగటు ఆదాయం కంటే ప్రాపర్టీ విలువ ఎక్కువగా ఉండటం. ఇది దిల్లీలో 9.85 ఉంది. ముంబైలో 29.94, దుబాయ్‌లో 7.16గా ఉంది. అంటే భారతీయ ప్రధాన నగరాలతో పోలిస్తే.. దుబాయ్‌లో అందుబాటు ధరలో ప్రాపర్టీ లభిస్తోంది.


ఉదాహరణకు.. 2500 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్.. గురుగ్రామ్‌లో రూ.6.5 నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటుంది. ముంబయిలో రూ.16-30 కోట్లు, హైదరాబాద్‌లో రూ.4.5 -7.5 కోట్లు, బెంగళూరులో రూ.4-9 కోట్ల వరకు ఉంటుంది. అదే 2500 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ దుబాయ్‌లోని దుబాయ్ సిలికాన్ ఓయాసిస్‌లో రూ.4-5 కోట్లు, దుబాయ్ ల్యాండ్‌లో రూ.3.5 -4.5 కోట్లు, జుమేరియా విలేజ్ సర్కిల్ రూ.4.5- 5.5 కోట్లు, జుమేరియా లేక్స్ టవర్ వద్ద రూ.7- 8.5 వరకు ఉంటుంది. భారతీయ నగరాలతో పోలిస్తే ఇది తక్కువే.


రెగ్యులేటరీ, మార్కెట్ వాతావరణం


పారదర్శక, సురక్షితమైన ఆస్తి చట్టాలు


దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ .. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను నియంత్రిస్తుంది. ఇది విదేశీ కొనుగోలుదారులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. భారతీయులు దుబాయ్‌లో పూర్తి యాజమాన్య హక్కులతో ఫ్రీహోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయవచ్చు.


ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వీసా పాలసీ


AED (United Arab Emirates dirham) 7,50,000 (దాదాపు రూ.1.8 కోట్లు) అంతేకంటే ఎక్కువ విలువైన ఆస్తులు కొనేవారికి UAE రెసిడెన్సీ వీసాలను అందిస్తుంది. AED 2 మిలియన్ల కంటే ఎక్కువ విలువున్న ఆస్తులను కొనేవారికి.. 10 సంవత్సరాల గోల్డెన్ వీసా కూడా లభిస్తుంది. ఇది భారతీయ కుటుంబాలకు దీర్ఘకాలిక నివాసం, పని, విద్యా ప్రయోజనాలను అందిస్తుంది.


జీవనశైలి, ప్రాక్టికల్ బెనిఫిట్స్


కనెక్టివిటీ


దుబాయ్ భౌగోళికంగా భారతదేశానికి దగ్గరగా ఉంది. ప్రధాన భారతీయ నగరాల నుంచి తరచుగా డైరెక్ట్ విమానాలు ఉంటాయి. తద్వారా ప్రాపర్టీ విజిట్స్, ఆస్తుల నిర్వహణను సులభంగా ఉంటుంది.


ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు


దుబాయ్.. అధిక-నాణ్యత కలిగిన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, అంతర్జాతీయ పాఠశాలలు (భారతీయ పాఠ్యాంశాలతో సహా), సురక్షితమైన, శుభ్రమైన నివాస ప్రాంతాలు భారతీయ కుటుంబాలను ఆకర్షిస్తున్నాయి.


ప్రాపర్టీ ఆప్షన్స్


దుబాయ్‌లో వివిధ బడ్జెట్ స్థాయిల్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. సౌత్ దుబాయ్, జుమేరియా విలేజ్ సర్కిల్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సరసమైన ధరల్లో అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. ఇక పామ్ జుమేరాలో లగ్జరీ విల్లాలు ఉంటాయి.


దుబాయ్ అందించే మెరుగైన జీవన ప్రమాణాలు, పెట్టుబడిపై రాబడి అవకాశాలు, వ్యాపార అనుకూల వాతావరణం, భద్రత, స్థిరత్వం వంటి అంశాలు భారతీయ మధ్యతరగతి, వేతన జీవులను ఆకర్షిస్తున్నాయి. ఆదాయపు పన్ను లేకపోవడం, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మెరుగైన విద్య, వైద్య సేవలు కూడా ఇక్కడి ఆస్తి మార్కెట్ పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి. ఒకప్పుడు అందని ద్రాక్షలా కనిపించిన దుబాయ్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనే కల.. ఇప్పుడు చాలా మంది భారతీయులకు సాకారమవుతోంది అని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa