ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ అదిరే శుభవార్త అందించింది. వివిధ రుణాలకు లింక్ అయి ఉండే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన టెన్యూర్ రుణాలపై 10 బేసిస్ పాయింట్ల మేర లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత రెండు ద్వైమాసికాల్లో రెపో రేటు తగ్గించి 6 శాతానికి పరిమితం చేసింది. ఈ క్రమంలోనే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తున్నాయి. తాజాగా కెనరా బ్యాంక్ ఆ జాబితాలో చేరిపోయింది. ఈ బ్యాంకులో వాహన, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి ఈఎంఐల భారం నుంచి ఉపశమనం లభించనుంది.
సాధారణంగా వాహన, వ్యక్తిగత రుణాలకు లింక్ అయి ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ప్రస్తుతం ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.10 శాతంగా ఉండగా దానిని 9 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. ఈ మేరకు గత శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలు వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ రేటుపైన పలు అంశాల ఆధారంగా వడ్డీ రేటును నిర్ణయిస్తారు. మంచి క్రెడిట్ స్కోరు ఉండి, బ్యాంకుతో సత్సంబంధాలు ఉన్న వారికి తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తారు.
ఇక నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు, 3 నెలలు, 6 నెలల వ్యవధి కలిగిన రుణాలకు ఎంసీఎల్ఆర్ రేటు 8.25 శాతం నుంచి 8.80 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఇక ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాైతంగా ఉండగా దానిని 8.2 శాతానికి తగ్గించినట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు మే 12, 2025 సోమవారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది.
ఇప్పటికే చాలా బ్యాంకులు రిజర్వ్ బ్యాంకును ఫాలో అయ్యాయి. రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు చేశాయి. అయితే, ఎంసీఎల్ఆర్ రేటు అనేది కనీస వడ్డీ రేటు. ఆపైన బ్యాంకు పలు అంశాలను పరిశీలించి వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది. క్రెడిట్ స్కోరు, రుణ గ్రహీత సామర్థ్యం, బ్యాంకు పనితీరు సహా చాలా అంశాలు ఇందులో ఉంటాయి. మరోవైపు.. రుణాల వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు డిపాజిట్ల వడ్డీ రేట్లనూ కోత పెడుతున్నాయి. దీంతో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి రాబడి తగ్గిపోనుంది.
![]() |
![]() |