ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయం దగ్గర పడుతోంది. ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించిన కొత్త ఐటీఆర్ ఫారమ్‌లను ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే విడుదల చేసింది. త్వరలోనే ఎక్సెల్ యుటిలిటీ కూడా అందుబాటులోకి రానుంది. అయితే, చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే.. పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలా లేక కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? ఈ రెండింటి మధ్య మీ గందరగోళానికి తెరదించుతూ, సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడే 6 ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.
1. తక్కువ పన్ను శ్లాబ్‌లు: కొత్త విధానం ఆకర్షణీయంగా అనిపించినా..
కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను శ్లాబులు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఎక్కువ మంది యువతరం దీనివైపు ఆకర్షితులు కావడానికి ఇది ఒక ముఖ్య కారణం. అయితే, ఇక్కడ మీరు ఎలాంటి ఆదాయపు పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకోలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
2. తగ్గింపుల ప్రయోజనాలు: పాత విధానంలో మీకు అన్నీ లభిస్తాయి
పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 80డీడీ, 80యూ వంటి వివిధ సెక్షన్ల కింద మీరు అనేక రకాల తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ పన్ను రేట్లు కొత్త విధానంతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ, వివిధ రకాల తగ్గింపులకు అర్హులైతే, పాత విధానం మీకు లాభదాయకంగా ఉండవచ్చు.
3. హెచ్ఆర్ఏ మినహాయింపు: జీతం పొందే వారికి కీలకం
ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే జీతం కలిగిన వ్యక్తులకు పాత పన్ను విధానం ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. సెక్షన్ 10(13ఏ) కింద హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపు లేదు. కాబట్టి, మీరు ఎక్కువ హెచ్ఆర్ఏ పొందుతుంటే, పాత విధానాన్ని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం కావచ్చు.
4. గృహ రుణంపై వడ్డీ: సొంతిల్లు ఉన్నవారికి..
కొత్త పన్ను విధానంలో గృహ రుణంపై చెల్లించే వడ్డీని ఇంటి ఆస్తి నుంచి ఆదాయం నుంచి తగ్గింపుగా క్లెయిమ్ చేయడానికి అనుమతి లేదు. మీరు సొంతిల్లు కలిగి ఉండి, గృహ రుణంపై వడ్డీ తగ్గింపు పొందాలనుకుంటే, మీరు తప్పనిసరిగా పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలి.
5. సెక్షన్ 87ఏ కింద రిబేట్: తక్కువ ఆదాయం ఉన్నవారికి..
పాత పన్ను విధానంలో, రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 87A కింద ఆదాయపు పన్ను రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, కొత్త పన్ను విధానంలో ఈ పరిమితి ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. బడ్జెట్ 2025లో ఈ పరిమితిని మరింతగా రూ. 12 లక్షలకు పెంచారు. మీ ఆదాయం తక్కువగా ఉంటే, కొత్త విధానం మీకు పన్ను భారం తగ్గించడంలో సహాయపడుతుంది.
6. ప్రామాణిక తగ్గింపు: రెండింటిలోనూ ప్రయోజనం!
పాత పన్ను విధానంలో ప్రామాణిక తగ్గింపు రూ. 50,000 ఉండగా, కొత్త పన్ను విధానంలో దీనిని 2024లో రూ. 75,000కు పెంచారు. కాబట్టి, ప్రామాణిక తగ్గింపు విషయంలో కొత్త విధానం కొంచెం ఎక్కువ ప్రయోజనం కలిగి ఉంది. ఇది వేతన జీవులకు మాత్రమే వర్తిస్తుంది.
పాత, కొత్త పన్ను విధానాల మధ్య ఎంపిక అనేది పూర్తిగా మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్న తగ్గింపులు,మీ ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా, రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించి, మీకు ఏది ఎక్కువ లాభదాయకమో అంచనా వేసుకున్న తర్వాతే ఒకదాన్ని ఎంచుకోవడం మంచిది. అవసరమైతే ఒక పన్ను నిపుణుడి సలహా తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
![]() |
![]() |