జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు భారత్ కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సోమవారం నొక్కి చెప్పారు.పొరుగు దేశం పాకిస్థాన్ఇ లాంటి చర్యలతో మానవత్వాన్ని హత్య చేస్తోందని, ఈ విషయం వారికి ఇంకా అర్థం కాకపోవడం విచారకరమని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. "ఈ దాడులతో మేము పాకిస్థాన్ వైపు వెళతామని వారు భావిస్తే, అది పూర్తిగా పొరపాటు. మేము 1947లోనే ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించాం, ఇప్పుడు మరింత గట్టిగా తిరస్కరిస్తున్నాం. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు... ఇలా మేమంతా ఒక్కటే. ఈ దురాక్రమణను శక్తియుక్తులతో, ఐక్యంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు.ఇలాంటి పిరికిపంద చర్యలతో తమను బలహీనపరచవచ్చని అనుకుంటే పొరపాటని, ఇది తమను మరింత బలోపేతం చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని తాను ఎప్పుడూ చెబుతూనే ఉంటానని, కానీ అమాయకుల ప్రాణాలు పోతుంటే చర్చలను ఎలా సమర్థించుకోగలమని ఆయన ప్రశ్నించారు. "ఈరోజు బాధలో ఉన్న కుటుంబాలకు మనం ఏం సమాధానం చెప్పగలం? కేవలం బాలాకోట్ లాంటి దాడులు కాదు, ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా దేశం పటిష్టమైన చర్యలు కోరుకుంటోంది" అని ఆయన అన్నారు.అంతకుముందు, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు. దేశ ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దాడిని ఖండించడంలో ఏకమయ్యారని తెలిపారు. బైసరన్‌లో జరిగిన దాడి మళ్లీ భయాందోళన వాతావరణాన్ని సృష్టించిందని, బాధితుల కుటుంబాలను ఓదార్చడానికి తనకు మాటలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |