దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారు ఉద్యోగాలు పొందే స్థాయిలోనే ఆగిపోకుండా, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే సంస్థల స్థాపకులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ (VIT-AP) యూనివర్సిటీలో జరిగిన 'వి లాంచ్‌పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్ పో' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన మహాత్మాగాంధీ, వి.వి. గిరి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ బ్లాక్‌లను ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని, అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేంద్రంగా మారనుందని స్పష్టం చేశారు. ఎంతో కీలకమైన రాజధాని నిర్మాణ పనులు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.విట్ అధినేత జి. విశ్వనాథన్‌తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాల్లో (పార్లమెంటు సభ్యునిగా), విద్యా రంగంలో అసాధారణ విజయాలు సాధించారంటూ విశ్వనాథన్‌ను ఆయన అభినందించారు. 2014 ఎన్నికల ఫలితాలు రాకముందే విశ్వనాథన్ తనను కలిసి అమరావతిలో విట్ ఏర్పాటుకు అనుమతి కోరారని, తాను వెంటనే 100 ఎకరాలు కేటాయించానని తెలిపారు. భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని భూములు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రాబోయే ఏడేళ్లలో విట్ అమరావతిలో విద్యార్థుల సంఖ్య 50 వేలకు చేరాలని ఆకాంక్షించారు.విట్ అమరావతిలో 95 శాతం ప్లేస్‌మెంట్స్ ఉండటం, ప్రపంచంలోని మేటి 100 విశ్వవిద్యాలయాల్లో విట్‌కు స్థానం దక్కడం గర్వకారణమని చంద్రబాబు కొనియాడారు. విట్ విద్యాసంస్థలన్నింటిలో అమరావతి క్యాంపస్ అగ్రస్థానంలో నిలవాలని తాను కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని, సృజనాత్మక ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
![]() |
![]() |