తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీసిన అంశం పైరసీ. ముఖ్యంగా కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యే పరిస్థితి నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పైరసీ సామ్రాజ్యానికి రాజుగా.. ట్రెండ్ సెట్టర్‌గా వెలుగొందిన వ్యక్తే ఐబొమ్మ ఇమంది రవి. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాల ద్వారా.. అనధికార వెబ్‌సైట్ల ద్వారా ఈయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలో పైరసీ ద్వారా కోట్ల రూపాయల అక్రమ సంపదను కూడబెట్టాడు.
సాంకేతిక పరిజ్ఞానంపై రవికి ఉన్న అపారమైన పట్టు.. అతన్ని సైబర్ నేరాల ప్రపంచంలో కింగ్‌మేకర్‌గా మార్చింది. తన పైరసీ కార్యకలాపాలను కేవలం దేశీయంగా కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాడు. దేశ, విదేశాల్లో వందలాది మంది ఏజెంట్లను నియమించుకుని, ఒక పటిష్టమైన నెట్‌వర్క్‌ను రూపొందించాడు. అతడి పైరసీ వ్యాపారం గుట్టు విదేశాల్లోని సర్వర్లలో నిక్షిప్తమై ఉండేది. యునైటెడ్ కింగ్‌డమ్, కరేబియన్ దీవుల వంటి ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యకలాపాలను నిర్వహించడానికి సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డేటా అంతా విదేశాల్లో ఉండటం వలన, తనను పట్టుకోవడం పోలీసులకు అంత సులభం కాదనే ధీమాతో రవి ఉండేవాడు.
ఐబొమ్మ వెబ్‌సైట్ పై నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులకు.. ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు సవాల్ విసిరి మరింత ఆగ్రహాన్ని తెప్పించాడు. తమపై దృష్టి పెట్టడం ఆపాలని నేరుగా పోలీసులకే సవాల్ విసిరాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన నగర సైబర్ క్రైమ్ పోలీసులు, రవి కదలికలపై సుమారు మూడు నెలల పాటు అత్యంత గోప్యంగా నిఘా పెట్టారు.
రవి ఎంతటి సాంకేతిక నిపుణుడైనా.. ఏదో ఒక ఆధారం వదిలేస్తాడనే సూత్రాన్ని పోలీసులు నమ్మారు. చివరకు.. ఒక కీలకమైన ఈ-మెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి ఆచూకీని పసిగట్టారు. రవి.. ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరుతో డొమైన్‌లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ల ద్వారా లభించిన ఫోన్ నంబరు ఆధారంగా.. రవి ఎవరెవరితో సంభాషిస్తున్నాడో, ఎలాంటి లావాదేవీలు చేస్తున్నాడో పోలీసులు విశ్లేషించడం మొదలుపెట్టారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రవి ఎక్కువ సమయం విదేశాల్లోనే గడిపేవాడు. అరుదుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న తన నివాసానికి వచ్చేవాడు. ఈ-మెయిల్ లింకుల ద్వారా పోలీసులు, రవికి నగరంలో ఉన్న అత్యంత సన్నిహితుడైన మిత్రుడిని గుర్తించారు. ఆ మిత్రుడి ఫోన్ నంబర్‌ను సేకరించి.. రవి హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా తమకు సమాచారం అందేలా రహస్యంగా ఏర్పాటు చేసుకున్నారు.
పోలీసుల వేట ఫలించింది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రవి.. తన మిత్రుడికి ఒక మెసేజ్ పంపాడు. ‘మామా హైదరాబాద్ వచ్చా.. అంటూ కూకట్‌పల్లిలోని తన ఇంటికి రావాలని స్నేహితుడిని ఆహ్వానించాడు. ఈ ఒక్క మెసేజ్ ద్వారా రవి నగరంలో ఉన్నట్లు కచ్చితంగా నిర్ధారించుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, క్షణం ఆలస్యం చేయకుండా కూకట్‌పల్లిలోని నివాసానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో రవి పొంతన లేని సమాధానాలు ఇస్తూ.. తన విదేశీ సర్వర్ల వివరాలు, సిబ్బంది గురించి అడిగిన ప్రతిసారీ సమాధానం దాటవేస్తున్నట్లు సమాచారం. అయితే.. తన పైరసీ వ్యాపారం ఏదో ఒక రోజు బయటపడుతుందని తనకు తెలుసని, కానీ ఇంత త్వరగా పట్టుబడతానని ఊహించలేదని మాత్రం పోలీసు అధికారులతో చెప్పినట్లు తెలిసింది. రవిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకుని లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa