తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల రక్షణ , ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా ( HYDRA) ఇటీవల తన ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వద్ద పాఠశాల విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు కాదని, అది అభివృద్ధికి ప్రతీక అని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
గత ఏడాది జూలై 19న ఏర్పడిన హైడ్రా.. తన ప్రస్థానంలో అనేక కీలక పనులు చేపట్టింది. మొదట్లో చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో దూకుడుగా వ్యవహరించామని, దాని ఫలితంగా చెరువుల ఆక్రమణలు గణనీయంగా తగ్గాయని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సామాజిక కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పేదల ఇళ్లను కూల్చడం లేదని, కబ్జాలకు పాల్పడిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్పై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా కృషి చేసింది. ఇప్పటివరకు చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలతో సహా దాదాపు 500 ఎకరాల భూమిని కాపాడగలిగారు. వీటి మొత్తం విలువ రూ.30 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ప్రజల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని కమిషనర్ తెలిపారు.
హైడ్రా చేపట్టిన ప్రాజెక్టులలో బతుకమ్మ కుంట పునరుద్ధరణ ఒక ముఖ్యమైన మైలురాయి. సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభిస్తారని, అదే రోజు బతుకమ్మ వేడుకలు జరుగుతాయని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇది హైడ్రా పనితీరుకు నిదర్శనమని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో బతుకమ్మ కుంటలు పునరుద్ధరించబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సల్కాం చెరువు, ఒవైసీ ఫాతిమా కాలేజీ వంటి అంశాలపై ఇంకా తుది నోటిఫికేషన్ రాలేదని, వాటిపై సామాజిక కోణంతో ముందుకు వెళ్తున్నామని కమిషనర్ వివరించారు. రాష్ట్రంలో మొత్తం 140 చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ వెలువడిందని, మిగతా చెరువుల సరిహద్దులతో పాటు తుది నోటిఫికేషన్ వచ్చాక, వాటి FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్‌లలో ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. హైడ్రా కేవలం పేదలపై కాకుండా.. పెద్దవారిపై కూడా సమానంగా పని చేస్తుందని, రాబోయే రోజుల్లో మరింత పటిష్ఠంగా కార్యకలాపాలు చేపడుతుందని కమిషనర్ రంగనాథ్ నొక్కి చెప్పారు. ఈ చర్యలు తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు, పట్టణ ప్రణాళికకు గణనీయంగా దోహదపడతాయి.
ఇదిలా ఉండగా.. ప్రకృతి పరిరక్షణతోనే మనందరం ఆరోగ్యకర జీవితాన్ని సాగించగలం. ప్రకృతిని మనందరం రక్షించుకోవాలి. అప్పుడే ప్రకృతి మనకు రక్షణగా ఉంటుంది. దీనిని హైడ్రా మహాయజ్ఞంలా చేపట్టింది. ఈ కృతువులో అందరూ భాగస్వామ్యం అయినప్పుడే మరింత ముందుకు తీసుకెళ్లగలం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండ్ ఫేమ్ విజువల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘సామాజిక, పర్యావరణ అంశాలపై’ నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రవీంద్రభారతిలో శనివారం ఏర్పాటు చేసిన ప్రదర్శనను హైడ్రా కమిషనర్ తిలకించారు. అనంతరం వార్షికోత్సవ వేడుకలలో హైడ్రా కమిషనర్ ప్రసంగించారు. నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెరువులు, పార్కులు, రహదారులు, నాలాలు ఆక్రమణలు కాకుండా కాపాడుతున్నామని చెప్పారు. ఈ ప్రయాణంలో అనేక ఆటంకాలు ఎదురౌతున్నా.. వెరవకుండా భవిష్యత్ తరాలకు పర్యావరణ ఫలాలు అందించేందుకు హైడ్రా అకుంఠిత దీక్షతో పని చేస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa