|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 09:25 PM
Bombay HC PF Pension: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) పెన్షన్‌కు సంబంధించిన కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా PF విత్‌డ్రా లేదా పెన్షన్ క్లెయిమ్ చేసేందుకు పాత, ప్రస్తుత కంపెనీల రికార్డులు తప్పనిసరి అవుతాయి. ఏ చిన్న డాక్యుమెంట్ లోపించినా అప్లికేషన్‌ను తిరస్కరించే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా పాత కంపెనీ రికార్డులు అందుబాటులో లేకపోతే, చాలా మంది ఉద్యోగులు తమ PF డబ్బులను పొందే అవకాశాన్ని కోల్పోయేవారు.అయితే ఈ పరిస్థితికి ముగింపు పలుకుతూ Bombay High Court కీలక తీర్పును ఇచ్చింది. పాత కంపెనీ రికార్డులు లేవన్న కారణంతో ఉద్యోగుల PF ఆధారిత పెన్షన్ ప్రయోజనాలను నిరాకరించడం సరైంది కాదని స్పష్టం చేసింది. కిరణ్ రాజారాం జాధవ్ వర్సెస్ EPFO కేసులో వచ్చిన ఈ తీర్పు, భవిష్యత్తులో హయ్యర్ పెన్షన్ క్లెయిమ్‌ల పరిశీలన విధానంపై గణనీయమైన ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా Form 6A వంటి చట్టబద్ధ PF రికార్డులను నిర్వహించే బాధ్యత పూర్తిగా యజమానులదేనని పేర్కొంది. ఉద్యోగులకు ఆ రికార్డులపై నియంత్రణ ఉండదని, వాటిని నిర్వహించడం వారి బాధ్యత కాదని స్పష్టం చేసింది. కాబట్టి పాత రికార్డులు లేవన్న కారణంతో హయ్యర్ పెన్షన్ క్లెయిమ్‌ను తిరస్కరించడం సరైన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది.పెన్షన్ నిర్ణయంలో Form 3A, EPF ఖాతా స్టేట్‌మెంట్‌లు, కాంట్రిబ్యూషన్ వివరాలు, జాయింట్ ఆప్షన్ అప్లికేషన్లు, యజమాని ధృవీకరణ వంటి వివిధ ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని కోర్టు సూచించింది. అలాగే సామాజిక భద్రత చట్టాలను కఠినంగా కాకుండా, ఉద్యోగులకు అనుకూలంగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది.ఈ తీర్పు నేపథ్యంలో PF విధానాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒకే డాక్యుమెంట్‌పై ఆధారపడకుండా సమగ్రంగా పరిశీలించడం, అవసరమైతే యజమానుల నుంచి సమాచారం సేకరించడం, ప్రత్యామ్నాయ ఆధారాలను పరిగణలోకి తీసుకోవడం, యజమానులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం వంటి మార్పులు రావచ్చని భావిస్తున్నారు.మొత్తానికి, ఈ తీర్పు PF నిబంధనలు కేవలం చెల్లింపులతో మాత్రమే ముగియవని, రికార్డుల సరైన నిర్వహణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. ఉద్యోగుల హక్కులను రక్షించే దిశగా ఇది ఒక కీలక ముందడుగు గా పరిగణించబడుతోంది.
Latest News