|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:42 PM
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు కీలకాధారమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని తాము పూర్తిగా మూసివేయలేదని, కేవలం తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలకు మాత్రమే ప్రవేశం నిరాకరిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.
శత్రువులకు మాత్రమే ఆంక్షలు..!
హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా జరుగుతుంది. ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేసిందంటూ వస్తున్న వార్తలపై అరాగ్చీ స్పందిస్తూ.. "ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం అనేక చమురు ట్యాంకర్లు ఇక్కడ ప్రయాణిస్తున్నాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని కంపెనీలు భయపడి ముందుకు రాకపోతే దానికి ఇరాన్ బాధ్యత వహించదు" అని తేల్చిచెప్పారు. చైనా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాల నౌకలకు ఇబ్బంది కలుగుతోందని, అందుకే తాము యుద్ధనౌకలను పంపిస్తామన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డారంటూ అమెరికా చేస్తున్న ప్రచారాన్ని అరాగ్చీ తోసిపుచ్చారు. "మొజ్తాబాకు ఎలాంటి సమస్యా లేదు. ఆయన రాజ్యాంగబద్ధంగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. మా దేశం ఏ ఒక్క వ్యక్తిపైనా ఆధారపడి లేదు. అత్యున్నత నాయకత్వంలో ఎటువంటి నష్టం జరిగినా తట్టుకునే శక్తి ఇరాన్ వ్యవస్థకు ఉంది" అని ఆయన భరోసా ఇచ్చారు.
గతంలో జెనీవా చర్చల సందర్భంగా అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, కుష్నర్‌లను ఉద్దేశించి "మా వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉంది" అని అరాగ్చీ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని, వారు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఖండించారు. త్వరలోనే ఆ చర్చలకు సంబంధించిన పూర్తి వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని.. హార్మూజ్ జలసంధిని తమకు అనుకూలంగా వాడుకుంటామని ఇరాన్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.