|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:44 PM
తమిళనాడులోని కరూర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ బస్సును గూడ్సు రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మంది కాలేజీ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కరూరు జిల్లాలోని కుళత్తూర్ సమీపంలో.. ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు రైల్వే లెవల్ క్రాసింగ్‌ను దాటే సమయంలో గూడ్సు రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తాంతోణి ప్రాంతంలో ఉండే ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు.. విద్యార్థులతో శనివారం సాయంత్రం కాలేజీ వద్ద నుంచి బయల్దేరింది. వెళ్లియణై వద్దనున్న కుళత్తూర్ వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో ఓ గూడ్సు రైలు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. కాలేజీ బస్సు వెనుక భాగాన్ని గూడ్సు రైలు బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో కూర్చున్న 23 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన విద్యార్థులలో 21 మందిని కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన విద్యార్థులను కరూర్ ఎంపీ జ్యోతిమణి పరామర్శించారు.
మరోవైపు గూడ్సు రైలు దిండుక్కల్ జిల్లాలోని కరికాళి ప్రాంతంలో ఉండే రాళ్ల క్వారీ నుంచి పులియూర్‌లోని ఓ ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీకి కంకర లోడును తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద సిబ్బంది లేనట్లు తెలిసింది.
Latest News