|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:39 PM
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే వారం ఇరాన్‌పై తమ సైన్యాలు మరింత భీకర దాడులు చేస్తాయని అమెరికా అధినేత హెచ్చరించారు. ఆయన ఫాక్స్ న్యూస్ రేడియోతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారీగా పెరిగిన చమురు ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో రష్యా ఆయిల్ కొనుగోళ్లకు తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపును జారీ చేసిన కొద్దిసేపటికే ఆయన ఈ హెచ్చరికలు చేశారు. ట్రంప్ సోషల్ మీడియాలో ‘‘అస్తవ్యస్తమైన చెత్త ఇరాన్ నాయకత్వాన్ని హత్యకు బాధ్యత వహించడం గొప్ప గౌరవం..’’ అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్- అమెరికాలు 15 వేలకుపైగా ప్రాంతాల్లో దాడులు చేసినట్టు ట్రంప్ వెల్లడించారు. గత 24 గంటల్లో పశ్చిమ, మధ్య ఇరాన్‌లో క్షిపణి లాంచర్లు, రక్షణ వ్యవస్థలు సహా 200 లక్ష్యాలపైగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
ఇక, ఇరాన్ నూతన సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ గురువారం తన మొదటి బహిరంగ ప్రకటనలో దాడులను కొనసాగిస్తానని, హర్మూజ్ జలసంధిని మూసివేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తండ్రి స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. లిఖితపూర్వక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రెండు వారాలుగా జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకూ 1,300 మంది ఇరాన్ పౌరులు చనిపోగా.. ఇజ్రాయెల్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపి దాడుల్లో సైనికులు 13 మంది మృతిచెందగా.. మరో 8 మంది గాయపడ్డారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్- అమెరికా దాడులతో భారీగా దెబ్బతిన్న ఇరాన్ సరెండర్‌కు సిద్ధంగా ఉందని జీ 7 దేశాల నేతల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని అనే కాల పరిమితి గురించి ఆయన స్పష్టత ఇవ్వలేకపోయారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్ లొంగిపోబోతుందని.. మనల్ని బెదిరిస్తున్న కేన్సర్ మహమ్మారిని నేను నిర్మూలించానని అయతుల్లా అలీ ఖమేనీ హత్య గురించి గొప్పలు చెప్పుకున్నట్టు పేర్కొన్నాయి.