|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:29 PM
నార్వే రాజధాని ఓస్లోలో అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన బాంబు దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వికృత ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితులలో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమారులు ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. వీరికి నార్వే కోర్టు నాలుగు వారాల పాటు పోలీస్ కస్టడీ విధించింది.
అసలేం జరిగిందంటే..?
గత ఆదివారం తెల్లవారుజామున ఓస్లోలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. అత్యంత శక్తివంతమైన ఐఈడీతో నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడు ధాటికి ఎంబసీలోని కన్సులర్ సెక్షన్ ప్రవేశ ద్వారం తీవ్రంగా దెబ్బతింది. అయితే పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ పోలీసులు ఈ ఘటనను తీవ్రమైన ఉగ్రవాద పేలుడుగా అభివర్ణించారు. ప్రాణనష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ పేలుడుకు ప్లాన్ చేశారని దర్యాప్తులో గుర్తించారు.
నేనే బాంబు అమర్చానంటూ వ్యక్తి ఒప్పుకోలు..
ఈక్రమంలోనే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే అరెస్టయిన నలుగురిలో ఒక కుమారుడు బాంబును తానే అమర్చినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే మిగిలిన ఇద్దరు సోదరులు, తల్లి మాత్రం తమకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నారు. వీరి తరపు న్యాయవాదులు కూడా వారు అమాయకులని వాదిస్తున్నారు. కానీ.. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ప్రకారం నలుగురూ కలిసి ఈ కుట్రలో భాగస్వామ్యం వహించినట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు.
నార్వే ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిందితుల ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా సాగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో ఈ కుటుంబానికి ఏవైనా సంబంధాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అమెరికా ఎంబసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Latest News