|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 05:18 PM
సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం కాకుండా, కేవలం ప్రత్యర్థులపై బురద జల్లడానికే ఉపయోగిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అడ్డగోలుగా ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. "సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్ విచారణలో జంతు కొవ్వు లేదని తేలిన తర్వాత కూడా, బాత్‌రూమ్ కెమికల్స్ కలిసాయంటూ మాట్లాడటం రాజకీయాలకు నిదర్శనం. మతాన్ని, భక్తిని కేవలం ఓట్ల కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లింది" అని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడే చంద్రబాబు.. రెండేళ్లుగా అధికారంలో ఉండి ఎందుకు నిజాన్ని నిరూపించలేకపోతున్నారని నిలదీశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు, హైకోర్టును సీమకు రాకుండా అడ్డుకున్న చంద్రబాబే రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు. తిరుమల పరిధిని ఏడు కొండలుగా నిర్ధారిస్తూ వైయస్సార్ జీవో ఇస్తే, నాడు దానిని రద్దు చేస్తానన్న చంద్రబాబు.. నేడు తానే హిందూ ధర్మ పరిరక్షకుడినని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైన చంద్రబాబు... తప్పుడు ప్రచారాలతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలు, తిరుమల, సింహాచలం తొక్కిసలాట మరణాల నుంచి నిన్నటి కదిరి నర్సింహస్వామి రథయాత్ర వరకు జరిగిన ప్రతి తొక్కిసలాటకూ చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమన్నారు.
Latest News