|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 07:44 PM
ఇటీవల ఇరాన్ నూతన సుప్రీం నాయకుడిగా ఎన్నికైన తర్వాత మోజ్తాబా ఖమేనీ తొలిసారి ప్రకటన చేశారు. అమెరికాపై ప్రతీకారం కోసం హర్మూజ్ జల సంధి మూసివేత, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ అధికారిక టెలివిజన్ న్యూస్ యాంకర్ గురువారం ఖమేనీ ప్రకటనను చదివి వినిపించారు. అయితే, ఆయన మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించగా.. మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్టు, ఆయన పరిస్థితి విషమంగా ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కానీ, తాజా ప్రకటన ఆయన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి తెరదించినట్టయ్యింది.
ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు పనిచేస్తూనే ఉంటే దాడులు తప్పవని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ హెచ్చరికలు చేశారు. ‘‘వీలైనంత త్వరగా ఆ స్థావరాలను మూసివేయాలని నేను సలహా ఇస్తున్నాను.. ఎందుకంటే అమెరికా భద్రత, శాంతిని స్థాపిస్తుందనే వాదన అబద్ధం తప్ప మరేమీ కాదని వారు ఇప్పటికే గ్రహించి ఉండాలి’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని మోజ్తాబా ప్రతిజ్ఞ చేశారు. తన శత్రువు నుంచి ఇరాన్ పరిహారం వసూలు చేస్తుందని చెప్పారు. అందుకు నిరాకరిస్తే వారి ఆస్తుల స్వాధీనం లేదా అదే స్థాయిలో నాశనం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు.
‘‘మా ప్రతీకారం కొంత వరకే తీరింది... కానీ మొత్తం పూర్తయ్యే వరకూ మా ప్రాధాన్యతలో ఇది ఒకటిగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఇరాన్ ఎప్పటికీ వెనక్కి తగ్గదని, పూర్తి శక్తితో ప్రతిఘటిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. దివంగత ఆయతుల్లా అలీ ఖమేనీకి మాత్రమే కాకుండా యుద్ధంలో ప్రతి పౌరుడి మరణానికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన శపథం చేశారు.
తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన తన తండ్రి ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవారని అన్నారు. తాను కూడా ఆయన మార్గంలో కొనసాగుతానని వెల్లడించారు. ‘‘ఆయన బలిదానం తర్వాత ఆయన పార్దీవదేహాన్ని చూసే గౌరవం నాకు దక్కింది.. చెక్కుచెదరకుండా బిగించి ఉన్న పిడికిలి దృఢ సంకల్పాన్ని చాటిచెప్పింది.. అమరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఆయన అన్నారు. లెబనాన్, ఇరాక్, యెమెన్‌తో సహా పశ్చిమాసియాలోని తన మిత్ర సాయుధ సమూహాలకు మోజ్తాబీ ఖమేనీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రస్తుత యుద్ధం ఆపాలంటే మూడు షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. రవాణా నిలిచిపోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చి, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.
Latest News