|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 01:21 PM
రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్, ఉచిత బస్సు ప్రయాణం, నిమిషం నిబంధన సడలింపు వంటివి వీటిలో ప్రధానమైనవి.పట్టణ, నగర ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మొబైల్ ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్స్ సహాయంతో సులభంగా సెంటర్‌కు చేరుకోవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో పరీక్షా కేంద్రానికి, తిరిగి ఇంటికి ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ సౌకర్యం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడనుంది.ప్రతి రోజూ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్ర ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 'నిమిషం నిబంధన'ను కూడా సడలించారు. ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Latest News