|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:35 PM
పశ్చిమ్ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తొలగించిన పేర్ల నిర్దారణకు నియమించిన న్యాయ అధికారులను ‘అనుమానించవద్దని’ బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, వ్యక్తిగత పిటిషనర్లను సుప్రీం కోర్టు మంగళవారం తీవ్రంగా హెచ్చరించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన ఓటర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పరిశీలన కోసం న్యాయాధికారులను నియమించామని, ఇప్పటికే విధుల్లో ఉన్న వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్ఐఆర్‌పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఈసీపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వయంగా సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ వాదనలు వినిపించారు.
‘‘న్యాయాధికారుల పనితీరును ప్రశ్నించే ధైర్యం చేయొద్దు... వారి నుంచి మీరు ఇంకా ఎలాంటి త్యాగాలను కోరుకుంటున్నారు.. పశ్చిమ్ బెంగాల్‌లో డిలీట్ చేసిన ఓటర్లకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్నారు.. దీనిని నేను ఏమాత్రం సహించను’’ అని విచారణ సందర్భంగా పిటిషనర్లపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సవరణ ప్రక్రియకు సంబంధించి కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని కూడా ధర్మాసనం ఆదేశించింది. కోర్టు నియమించిన న్యాయ అధికారుల నిర్ణయాలపై సందేహాలు లేవనెత్తిన పిటిషన్‌పై తీవ్రంగా స్పందిస్తూ.. వారి నిర్ణయాలను గౌరవించాలని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టం చేశారు. అప్పీళ్లను నిర్వహించే న్యాయ అధికారులకు తగిన సహాయం, రవాణా సౌకర్యాలను కల్పించాలని ఎన్నికల సంఘం, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాజ్యంలో ఇరుపక్షాల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇరుపక్షాల నిజాయితీని మేం అనుమానిస్తున్నాం’ అని ఆయన అన్నారు. న్యాయ అధికారులల ప్రశ్నిస్తూ తాజా పిటిషన్‌ను ఎవరు దాఖలు చేశారో స్పష్టం చేయాలని పార్టీలను కోరారు. పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ-న్యాయవాది కళ్యాణ్ బెనర్జీ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తిన కొత్త పిటిషన్ గురించి తమకు తెలియదని చెప్పడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పశ్చిమ్ బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగింపులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతో అప్పిటేల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్ అధికారులు ద్వారా తిరస్కరణకు గురైన ఓటర్లు.. ఈ ట్రైబ్యునల్స్‌ను కూడా ఆశ్రయించవచ్చు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య వివాదం నేపథ్యంలో బెంగాల్, పొరుగున ఉన్న ఒడిశా, ఝార్ఖండ్‌లోని న్యాయ అధికారులను నియమించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Latest News