|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:28 PM
సుప్రీం కోర్టులో మంగళవారం ఒక వింతైన సన్నివేశం చోటుచేసుకుంది. పీఎం కేర్స్ ఫండ్‌ను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ లూధియానాకు చెందిన ఓ వ్యాపారి పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సదరు వ్యాపారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా వెళ్లి లుథియానాలో స్వెటర్లు అమ్ముకోపో అంటూ కామెంట్లు చేశారు. మరి సీజేఐ ఇలా ఎందుకు మాట్లాడారో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?
ఏఐ సాయంతో పిటిషన్ రాయించి..
లూధియానాకు చెందిన సదరు వ్యాపారి 12వ తరగతి వరకు చదువున్నాడు. అయితే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఇతడు.. తన వాదనలు తానే వినిపించేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా ఆయన సమర్పించిన పిటిషన్‌లో ఉన్న క్లిష్టమైన రాజ్యాంగ పదజాలం, న్యాయ పరిభాషను చూసిన సీజేఐకి అనుమానం కలిగింది. "ఈ పిటిషన్ ఎవరు రాశారు?" అని ప్రశ్నించగా.. తానే రాశానని ఆ వ్యాపారి బదులిచ్చారు. దీనితో సీజేఐ అక్కడికక్కడే ఆయనకు ఒక పరీక్ష పెట్టారు. "ఇందులో ఉన్న 'Fiduciary Risk of Corporate Donors' అనే పదానికి అర్థం చెబితే.. నువ్వే రాశావని నమ్ముతాను.. కనీసం 30 శాతం మార్కులు సాధించినా చాలు" అని సవాల్ విసిరారు. దానికి సమాధానం చెప్పలేక ఆ వ్యాపారి మౌనంగా ఉండిపోయాడు.
దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యాపారిని గట్టిగా నిలదీశారు. దీంతో అతడు అసలు విషయం బయట పెట్టాడు. ఆ పిటిషన్ రాసేందుకు తాను న్యాయవాదుల సాయం తీసుకోలేదని.. మూడు నాలుగు ఏఐ టూల్స్ సాయంతో పిటిషన్ డ్రాఫ్ట్ చేశానని ఒప్పుకున్నాడు. దీనిని ఫార్మాట్ చేసినందుకు దాస్ అనే టైపిస్ట్‌కు గంటకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించడమే కాకుండా.. నాలుగు జాకెట్లను బహుమతిగా ఇచ్చానని చెప్పాడు. దీనితో విస్మయం చెందిన న్యాయస్థానం.. ఆ టైపిస్ట్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
"వెళ్లి స్వెటర్లు అమ్ముకో.."
ఈ పిటిషన్‌లో ఎలాంటి బాధ్యత లేదని.. కేవలం నిరాధారమైన ఆరోపణలతో నిండి ఉందని పేర్కొంటూ న్యాయస్థానం దానిని కొట్టివేసింది. "ఇలాంటి అర్థరహితమైన పిటిషన్లతో కోర్టుకు రావద్దు.. వెనుక ఉండి నడిపించేవారు తప్పించుకుంటారు. కానీ.. బలి అయ్యేది నీలాంటి వాళ్లే. వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో" అని సీజేఐ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరిస్తూ వ్యాపారిని ఇంటికి పంపించివేశారు.
Latest News