|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:13 PM
చంద్రబాబు ఉప ప్రధాని అవుతారనే ప్రచారం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. బుధవారం రోజున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ఈ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తారు.. ఉప ప్రధాని అవుతారనే ప్రచారం జరుగుతోందని.. దీనిపై మీరేమంటారంటూ వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. అయితే దీనికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు జగన్." చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పినారు సామీ.. గొప్ప సంగతే ఇది. చంద్రబాబును ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలే బరాయించలేకున్నారు.. ఉప ప్రధానిగా దేశ ప్రజలు ఏం బరాయిస్తారంటూ" వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. 16 రోజుల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు.. తన తనయుడు లోకేష్‌ను జాకీలు పెట్టి ఎత్తుతాడని.. కొడుకు తండ్రికి జాకీలు పెట్టి ఎత్తుతాడని.. వీరిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తటం తప్ప.. ప్రజలకు ఒరిగింది సున్నా అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.
మరోవైపు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉగాది తర్వాత నారా లోకేష్ ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారంటూ పేర్ని నాని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య ఇప్పటికే మాటలు జరిగాయని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. అలా కాకుండా నారా లోకేష్‌ను సీఎం చేస్తామంటే కాపులు ఊరుకోరని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈ ప్రచారంపై స్పష్టత లేదు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరని సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు.