|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 09:57 AM
తిరుపతి తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు ఇచ్చుకుంటుంటే ఇంకోపక్క పరకామణిలో దేవుడి సొమ్ము ఆయనకే దక్కకుండా కొంతమంది దొంగలు కాజేస్తున్నారని, ఈ వరుస చోరీలు చూస్తుంటే దీని వెనుక పెద్దల హస్తం ఉండే ఉంటుందని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెంచలయ్య వంటి వారు ఆరు నెలల్లోనే 24 సార్లు చోరీకి పాల్పడ్డాడంటే మామూలు విషయం కాదని, చోరీ తరువాత కూడా ఆయన నుంచి ఆస్తులు ఎందుకు రాయించుకోలేదని ప్రశ్నించారు. మూడేళ్ల కిందట రవికుమార్ చోరీ చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టిన అధికారులు ఏడాది కిందట చోరీ చేసిన పెంచలయ్య వీడియో ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా చెన్నై పరకామణిలో పనిచేసే కృష్ణకుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ విదేశీ కరెన్సీ తక్కువగా చూపించి రూ. 87 లక్షలు అవకతవకలకు పాల్పడినా ఉద్యోగంలో కొనసాగడం టీటీడీ వైఫల్యమేని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ నుంచి రూ. వంద కోట్ల విలువై ఆస్తులు రాయించుకున్నామని అయినా దాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక పరకామణిలో జరుగుతున్న చోరీలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పరకామణిలో జరిగే అవకతవకలపై సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా అని భూమన ప్రశ్నించారు. చోరీలకు పాల్పడుతున్ననిందితుల వెనుక ఉన్న పెద్ద తిమింగళాలను బయటకు తీస్తామని, త్వరలోనే వీటిపై ఫిర్యాదు చేస్తామని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
Latest News