ప్రభుత్వానికి షాకిచ్చిన విపక్షాలు,,,స్పీకర్‌ ఓం బిర్లా అభిశంసనపై వ్యూహాత్మక ఎత్తుగడ
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:53 PM

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజున విపక్షాలు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాన్ని విస్మయానికి గురిచేసింది. ముందు నిర్ణయించిన ప్రకారమైతే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌ కోరాలని ప్రతిపక్షాలు భావించాయి. కానీ, తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ఆ అంశాన్ని పక్కన బెట్టి.. వ్యూహాత్మక ఎత్తుగడతో ప్రభుత్వానికి షాకిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం.. దాని ఆర్థిక, మానవత ప్రభావం .. చమురు ధరలు, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.


మొదటి రోజు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు, నినాదాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘పశ్చిమాసియా తగలబడిపోతోంది, భారతీయులు చిక్కుకున్నారు.. చమురు లేదు. మోదీజీ.. ట్రంప్‌నకు తలవంచడం ఆపండి’అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రాజ్యసభలో యుద్ధ పరిణామాలపై ప్రకటన చేయడం గమనార్హం.


పశ్చిమాసియా యుద్ధంపై చర్చించాలన్న విపక్షాల నిరసనలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ప్రతిపక్షం డిమాండ్‌కు అధికార పక్షం నిరాకరించడంతో గందరగోళానికి దారితీసి పలుసార్లు లోక్‌ సభను వాయిదా పడింది. పలు వాయిదాల అనంతరం సభ ప్రారంభమైనా.. ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంతో స్పీకర్ మంగళవారానికి సభను వాయిదా వేశారు.


పశ్చిమాసియా యుద్ధంప్రభావం


అనంతరం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘పశ్చిమాసియాలో జరుగుతున్నది గణనీయమైన నష్టాన్ని కలిగించబోతోంది. మన ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాన్ని చవిచూడబోతోంది. స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటో ఇప్పటికే చూశారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది... కాబట్టి దాని గురించి చర్చించండి.. చమురు ధరలు, దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చిస్తే సమస్య ఏంటి?.. ఇవన్నీ ప్రజా అంశాలే కదా? దీనిపై మేము లోక్‌సభ స్పీకర్‌తో చర్చిస్తాం’’ అని ఉద్ఘాటించారు.


ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ ఓ విఫల ప్రతిపక్ష నేత అని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘స్పీకర్‌పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది.. కానీ, ఇప్పుడు చర్చ నుంచి పారిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి సీనియర్ నాయకులు ఈ ఉదయం హాజరైన సమావేశం నుంచే వ్యూహాలు మారాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి ప్రారంభంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఓం బిర్లా సభ నిర్వహణపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.


కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన నోటీసులో.. బిర్లా బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడటానికి సమయం ఇవ్వలేదని ఆరోపించారు.


అవిశ్వాసం నుంచి యుద్ధం


అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత కనీసం రెండు వారాలు గడువు ఉండాలి. కానీ, తొలి విడత సమావేశాలు ముగియడానికి ముందే నోటీసు ఇవ్వడంతో చర్చకు అవకాశం లేకుండా పోయింది. రెండో విడతలో దీనిపై చర్చించే పరిస్థితి ఏర్పడగా.. ఆదివారం రాత్రి టీఎంసీ సహా ఇండియా కూటమి నేతలు సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. స్పీకర్‌ అభిశంసన తీర్మానంపై చర్చ, ఓటింగ్‌కు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీనికి తృణమూల్ కాంగ్రెస్ సైతం మద్దతు తెలిపింది. కానీ, సోమవారం ఉదయం వ్యూహం మారిపోయింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఇరాన్ యుద్ధంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.


యుద్ధం కారణంగా ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి నిలిచిపోవడం, రవాణాకు కీలకమైన హర్మూజ్ జల సంధిని మూసివేయడంతో చమురు ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. అయితే, 70 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం గతవారం ప్రకటించింది. స్పీకర్ అవిశ్వాస తీర్మానం విషయంలో టీఎంసీ మద్దతు లభించినా.. పూర్తి సంఖ్యా బలం లేదనే ఉద్దేశంతో ఇండియా కూటమి వెనక్కి తగ్గినట్టు సమాచారం.


కాంగ్రెస్ కేరళ కోణం


కాంగ్రెస్ వ్యూహం మార్చడానికి కేరళ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిడే కారణమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏప్రిల్ లేదా మేలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో విజయంపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. గల్ఫ్ దేశాల్లో సుమారు 25 లక్షల మంది కేరళ ప్రజలు ఉపాధి పొందుతున్నారు. పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులతో వీరి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఇప్పటికీ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఉండటంతో వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఈ అంశాన్ని లేవనెత్తి.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని నిర్ణయించింది.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM