|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 08:45 PM
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ నాయక్ ఐదో రోజు విచారణ ముగిసింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణ అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ ఆయనను ప్రశ్నించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. సీసీఎస్ స్టేషన్‌కు తరలించడానికి ముందు, సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో రఘురామ కస్టోడియల్ టార్చర్ ఘటనకు సంబంధించి పోలీసులు సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం.గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారంతో ఈ విచారణ ముగుస్తుందని అంతా భావించారు. అయితే, సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా.. సునీల్ నాయక్ తరపు న్యాయవాదులకు వాదనలు వినిపించేందుకు న్యాయస్థానం మార్చి 12 వరకు అవకాశం కల్పించింది.విచారణ అధికారి కోరిక మేరకు, మార్చి 12 వరకు విచారణకు హాజరుకావాలని హైకోర్టు సునీల్ నాయక్‌ను ఆదేశించింది. దీంతో మరో మూడు రోజుల పాటు ఆయనను విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు కాళ్లు వాచి, నడవలేని స్థితిలో కోర్టుకు హాజరైన ఘటన ఈ కేసుకు ప్రధాన కేంద్రం అన్న విషయం తెలిసిందే.
Latest News