ఇరాన్‌లో నరకం చూస్తున్న భారతీయ మెడికోలు
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:36 PM

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలతో అక్కడ చదువుకుంటున్న వందలాది మంది భారతీయ వైద్య విద్యార్థుల జీవితాలు అల్లకల్లోలంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులు 10వ రోజుకు చేరుకోగా.. ఇరాన్‌లోని వివిధ నగరాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. క్షిపణి దాడులు, బాంబు పేలుళ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకులు కూడా అపోవస్తున్నాయని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఆగితే ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందని.. వెంటనే తమను స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


బంకర్లలో బతుకీడుస్తున్న విద్యార్థులు


ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎమ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌లోని ఇస్ఫాహాన్, ఖోమ్, కెర్మాన్, షిరాజ్ వంటి నగరాల నుంచి ఇప్పటి వరకు 18కి పైగా అత్యవసర విన్నపాలు అందాయి. ముఖ్యంగా ఇస్ఫాహాన్ నగరంలోని 'దర్వాజే-యే షిరాజీ' ప్రాంతంలో తమ హాస్టల్ సమీపంలోనే పేలుళ్లు సంభవించడంతో.. సుమారు 32 మంది భారతీయ మెడికోలను భూగర్భ బంకర్లలోకి తరలించినట్లు సమాచారం. మార్చి 7, 8 తేదీల్లో క్షణ క్షణం పేలుళ్లు వినిపిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


కేవలం పేలుళ్లు మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువుల కొరత కూడా విద్యార్థులను వేధిస్తున్నట్లు ఏఐఎమ్ఎస్ఏ తెలిపింది. కెర్మాన్ నగరంలో ఉన్న విద్యార్థులు తమ వద్ద ఉన్న ఆహార నిల్వలు నిండుకున్నాయని, బయటకు వెళ్లే పరిస్థితి లేక ఆకలితో అలమటిస్తున్నామని సమాచారం అందించినట్లు స్పష్టం చేసింది. టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కూడా తమ నివాసాలకు సమీపంలోని భవనాలు ధ్వంసం కావడంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా ఏఐఎమ్ఎస్ఏ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ మోమిన్ ఖాన్ మాట్లాడుతూ.. "పరిస్థితి చేయిదాటిపోకముందే భారత విదేశాంగ శాఖ స్పందించాలి. విద్యార్థుల భద్రత మా మొదటి ప్రాధాన్యత" అని పేర్కొన్నారు.


ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతాప్ పార్క్ వద్ద నిరసన చేపట్టిన బాధితుల కుటుంబ సభ్యులు.. తమ పిల్లలను వెంటనే 'ఆపరేషన్ కావేరి' లేదా 'వందే భారత్' తరహాలో ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి రప్పించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.


ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ కొత్త క్షిపణి దాడులను ప్రకటించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా సెంట్రల్ ఇరాన్‌పై దాడులను ఉధృతం చేసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి యుద్ధ ముగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం పరిస్థితి తీవ్రతను చాటిచెబుతోంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM