|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 08:04 PM
పశ్చిమాసియాలో యుద్దం కారణంగా తన పొరుగు దేశాలపై జరిపిన దాడులకుఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ శనివారం క్షమాపణలుచెప్పిన విషయం తెలిసిందే. అయితే, కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకుని.. పక్క దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు శత్రువులుగా ఉన్న దేశాలకు.. తమ భూభాగాలను దాడులకు వినియోగించుకోడానికి అవకాశం కల్పిస్తున్న పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ‘మన దేశంపై దాడులకు అవసరమైన స్థావరాలను శత్రువులకు అందిస్తున్న ప్రాంతీయ పొరుగు దేశాలను ఇస్లామిక్ రిపబ్లిక్ లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తుంది’ అని ఆయన ఉద్ఘాటించారు.
‘‘ఇరాన్ సాయుధ దళాల నుంచి వచ్చిన ఆధారాలు పశ్చిమాసియాలోని కొన్ని దేశాల భౌగోళిక ప్రాంతాలు శత్రువుల వినియోగానికి బహిరంగంగా, రహస్యంగానో అనుకూలంగా ఉన్నాయని చూపుతున్నాయి’’ అని తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడు అయిన ఘోలామ్‌హోస్సేన్ మొహ్సేని ఎజీ అన్నారు. ‘ఈ లక్ష్యాలపై భారీ దాడులు కొనసాగుతాయి’ అని ఆయన అన్నారు. కాగా, పెజిష్కియాన్ క్షమాపణలు చెప్పిన కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..వారిని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ తోక ముడిచిందని, ఇక అది ఎలాంటి దాడులు చేయలేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు, భారీ దాడులు తప్పవని హెచ్చరించారు.
గతవారం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అమెరికా మిత్రులైన గల్ఫ్ దేశాల్లో ఈ స్థావరాలు ఉండటంతో ఇరాన్ వాటిని టార్గెట్ చేసింది. దీంతో క్షిపణలు, డ్రోన్‌లతో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలపై తాము ఉద్దేశపూర్వకంగా దాడులు చేయలేదని ఇరాన్ శనివారం ప్రకటించింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసే ఆలోచన తమకు లేదని క్షమాపణలు చెప్పింది. అంతేకాదు, మీ భూభాగాల నుంచి మాపై దాడలు చేయకుంటే తాము కూడా ఎలాంటి చర్యలకు పాల్పడమని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు. దీనిపై తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కానీ, అంతలోనే మళ్లీ యూటర్న్ తీసుకోవడం గమనార్హం.
ఇరాన్ హెచ్చిరించినట్టుగానే గల్ఫ్ దేశాలపై శనివారం రాత్రి నుంచి భీకర దాడులు మళ్లీ మొదలుపెట్టింది. దుబాయ్‌లో భారీ ఎత్తైన భవనం దుబాయ్ మరీనోపై దాడిచేసింది. ఇరాన్ క్షిపణి ఆ భవనాన్ని తాకడంతో చుట్టూ దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ దాడిలో స్వల్ప నష్టం జరిగినట్టు అధికారులు నివేదించారు. ఇక, సౌదీ అరేబియా సైతం ఇరాన్ దాడులను ధ్రువీకరించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకున్నట్టు తెలిపింది. ఈ దాడులతో యూఏఈ తన గగనతలాన్ని మూసివేసింది.