బ్రిటన్‌ ప్రధానికి ట్రంప్ హెచ్చరికలు
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 07:57 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్‌పై వ్యంగాస్త్రాలు సంధించారు. అమెరికా ఇప్పటికే విజయం సాధించిన యుద్ధంలోకి ఇప్పుడు బ్రిటన్ తన యుద్ధ విమాన వాహక నౌకలను పంపాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. "ఒకప్పుడు మా గొప్ప మిత్రదేశమైన యునైటెడ్ కింగ్‌డమ్.. ఇప్పుడు మధ్యప్రాచ్యానికి రెండు యుద్ధ నౌకలను పంపాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. సరే ప్రధాని స్టార్మర్.. కానీ ఇప్పుడు మాకు వాటితో అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని (సమయం మించిపోయాక స్పందించడాన్ని) మేము గుర్తుంచుకుంటాం. మేం ఇప్పటికే గెలిచేశాక.. మాతో కలిసేవాళ్లు మాకు అవసరం లేదు" అంటూ హెచ్చరికతో కూడిన చురకలు అంటించారు. అంతేకాకుండా అగ్రరాజ్యం ఒంటరిగానే శత్రువును మట్టి కరిపించిందనే ధీమాను కూడా వ్యక్తం చేశారు.


 "ఇరాన్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లూజర్"


ఇరాన్ తన పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పిందని, ఇకపై దాడులు చేయబోమని హామీ ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. "అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన కనికరం లేని దాడుల వల్లే ఇరాన్ ఈ నిర్ణయానికి వచ్చింది. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ పొరుగు దేశాల చేతిలో ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టే 'బుల్లీ'లా ఉన్న ఇరాన్.. ఇప్పుడు ఒక 'లూజర్' (ఓడిపోయిన దేశం)గా మారింది. ఆ దేశం పూర్తిగా కుప్పకూలిపోయే వరకు లేదా లొంగిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది" అని ట్రంప్ విశ్లేషించారు.


ఇంతటితో ఆగకుండా ఇరాన్‌కు ట్రంప్ ఆఖరి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే.. ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామని, అవి అత్యంత భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. "నేడు ఇరాన్ చాలా గట్టి దెబ్బ తినబోతోంది. పూర్తి విధ్వంసం, చావు తప్పదని గుర్తుంచుకోవాలి" అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన నాయకత్వంలోనే పశ్చిమాసియా ప్రశాంతంగా మారుతోందని, ఇందుకు అందరూ తనకు 'థాంక్యూ' చెబుతున్నారని ట్రంప్ తనను తాను ప్రశంసించుకున్నారు.


ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అయితే ఈ యుద్ధంలో తమ సైనిక స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవడానికి బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ ముందుగా ఒప్పుకోలేదు. అయితే ఇరాన్‌పై దాడి కోసం కాకుండా.. తమను తాము రక్షించుకోవడం కోసం వాడుకోవచ్చంటూ కొంత సడలింపు ఇచ్చారు. బ్రిటిష్ ఎయిర్ బేస్‌లు, మిత్రదేశాలను కాపాడటానికి మధ్యదరా సముద్ర ప్రాంతానికి హెచ్ఎంఎస్ డ్రాగన్ అనే యుద్ధ నౌకను పంపుతామని ప్రకటించింది. అమెరికాకు బ్రిటన్ వంత పాడకపోవడంతో.. స్టార్మర్ తీరు పట్ల ట్రంప్ కొంత గుర్రుగా ఉన్నారు. అందుకే మీ అవసరం లేదంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM