|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:28 PM
గురువారంఅసోంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ ఎస్‌యూ 30 యుద్ధ విమానం కూలిపోగా.. అందులోని ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో మృతిచెందిన పైలట్లను స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్‌కర్ (28)గా గుర్తించారు. వీరిలో పూర్వేశ్ దురాగ్‌కర్ గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దురాగకర్ సెలవులపై ఇంటికి వెళ్లి పది రోజుల కిందటే తిరిగొచ్చారు. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపి వచ్చి, విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
ఆయన తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘‘గతేడాది భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో నా కొడుకు కూడా పాల్గొన్నాడు. ఆపరేషన్ నిలిపివేసిన రెండు వారాల అనంతరం ఈ విషయం మాకు తెలిసింది. సిందూర్ కొనసాగినన్ని రోజులూ మాతో పూర్వేశ్ టచ్‌లో లేడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తుండటం, యుద్ధ విమానాలను నడపడాన్ని ఎంతో గర్వంగా భావించేవాడు. ఆ అనుభవాలను మాతో పంచుకునేవాడు. బుధవారం (మార్చి 4న) కుటుంబసభ్యులతో మాట్లాడాడు. భరతమాత సేవలో తన ప్రాణాలు అర్పించిన వీరుడైన నా బిడ్డ అందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తాడు. సుదీర్ఘంగా దేశానికి సేవచేయాలని అనుకున్నాడు కానీ, ఆ కల నెరవేరలేదు’’ అని పూర్వేశ్ తండ్రి రవీంద్ర కన్నీటిపర్యంతమయ్యారు.
సెలవుపై స్వగ్రామానికి వెళ్లిన పూర్వేశ్.. పది రోజుల కిందట కుటుంబం నిర్వహించిన గెట్ టు గెదర్‌లో సంతోషంగా గడిపారు. మార్చి 5న సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం శిక్షణ మిషన్‌లో భాగంగా అసోంలోని జొర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయి.. కొద్దిసేపటికే గల్లంతయ్యింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోయి 60 కి.మీ.దూరంలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. జోర్హాట్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానం చోకిహోలా కింద ఉన్న నిలిప్ బ్లాక్ వద్ద మారుమూల ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పైలట్ల సేవలను, వారి చూపిన తెగువ, ధైర్యాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. అనూజ్, పూర్వేష్ మరణంపై రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. ఇక, రష్యా తయారుచేసిన ఈ ఫైటర్ జెట్లు.. ఈశాన్య ప్రాంతం భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1997లో వీటిని భారత్‌కు అందజేయగా.. ప్రస్తుతం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది.
Latest News