|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 06:28 PM
కడప జిల్లాలో ఓ రైతు పొలంలో ఒక్కసారిగా భూమి కుంగిపోయింది.. పెద్ద గొయ్యి ఏర్పడింది. మైదుకూరు నియోజకవరక్గం ఖాజీపేట మండలం కొత్తపేటలో రైతు జయరామిరెడ్డికి పొలం ఉంది. ఒక్కసారిగా ఆ పొలంలో రెండు అడుగుల వెడల్పుతో రౌండ్‌గా భూమి కుంగిపోయి భారీ గొయ్యి ఏర్పడింది.. ఏకంగా 20 అడుగుల లోతులో నీళ్లు కూడా కనిపించాయి. వెంటనే రైతు వెళ్లి ఆ గొయ్యిని పరిశీలించారు.. లోపల వెడల్పుగా విశాలంగా కనిపించింది. అచ్చం బావి తవ్వినట్లుగా.. అందులో నీళ్లు కూడా ఉన్నట్లుగా గొయ్యి ఏర్పడటంతో రైతు జయరామిరెడ్డితో పాటు స్థానికులు అవాక్కయ్యారు.
తన పొలంలో ఈ గొయ్యి ఏర్పడిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు రైతు జయరామిరెడ్డి సమాచారం ఇచ్చారు. వారు పొలంలో ఏర్పడిన గుంతను పరిశీలించారు. పొలంలో ఏర్పడిన గొయ్యిలో పొరపాటున ఎవరైనా పడే ప్రమాదం ఉందని భావించి.. ముందస్తు జాగ్రత్తగా ఒకరిని అక్కడ కాపలాగా ఉంచారు. ఈ గొయ్యి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని స్థానిక తహసీల్దారు తెలిపారు. భూగర్భ జలాల కారణంగా భూమి ఇలా కుంగి గొయ్యి ఏర్పడిందా?.. గతంలో బావి తవ్విన ప్రాంతంలో భూమి కుంగి గొయ్యి పడిందా? అనేద క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు ఈ గొయ్యిని పరిశీలంచి కారణాలు ఏంటో తేల్చాలని రైతులు కోరుతున్నారు.
సోమవారం ఉదయం పొలంలో ఏర్పడిన ఈ గొయ్యిని కొత్తపేటకు చెందిన కొందరు స్థానికులు గమనించి తనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని రైతు జయరామిరెడ్డి చెబుతున్నారు. వెంటనే పొలం దగ్గరకు వచ్చి చూస్తే గొయ్యి కనిపించిందన్నారు. లోపలికి చూస్తే దాదాపు 20 అడుగుల లోతు ఉందని..లోపల నీళ్లు కూడా కనిపిస్తున్నాయన్నారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చానని.. వారు వచ్చి పరిశీలించారన్నారు. 2024 సెప్టెంబర్‌లో కూడా ఇలాగే భూమి కుంగింది. దువ్వూరు మండలం చింతకుంటలోని పొలంలో భూమి కుంగి ఆరు అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. అంతకముందు 2019లో కూడా ఇలాగే భూమి కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. పొలంలో ఏర్పడుతున్న ఈ గొయ్యిల్ని పూడ్చటం ఖర్చుతో కూడుకుని ఉందంటున్నారు రైతులు.