|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:48 PM
పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్-అమెరిగా సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్త నిజమేనని ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28వ తేదీ శనివారం రోజు తెల్లవారుజామున టెహ్రాన్‌లోని తన కార్యాలయంలో ఉండగానే ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు బహిరంగ సంతాప దినాలను ప్రకటించగా.. ఖమేనీ భార్య, పిల్లలు ఎవరు, వారిప్పుడు ఎక్కడ ఉన్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అత్యంత రహస్యంగా ఖమేనీ కుటుంబ నేపథ్యం
ఖమేనీ దాదాపు 35 ఏళ్ల పాటు ఇరాన్ రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలను శాసించినప్పటికీ.. ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ గోప్యంగానే ఉండేది. ఆయన మరణం తర్వాత ప్రపంచం చూపు మొత్తం ఆయన కుటుంబంపై పడింది. ఖమేనీకి భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే, ఆరుగురు సంతానం ఉన్నారు. అయితే ఖమేనీ భార్య మన్సూరే తన భర్త సుదీర్ఘ పాలనలో ఎన్నడూ బహిరంగంగా కనిపించలేదు. ఆమె కుటుంబం వ్యాపార, మీడియా రంగాల్లో ప్రభావం కలిగి ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు.
అయితే మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే కుటుంబం ప్రభావవంతమైన పదవులను నిర్వహించింది. ఆమె తండ్రి మొహమ్మద్ ఎస్మాయిల్ ఖోజాస్తే బగెర్జాదే.. మషద్‌లో వ్యాపారవేత్త. ఆమె సోదరుడు, హసన్, గతంలో ఆ దేశ రాష్ట్ర ప్రసార సంస్థ అయిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ కి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఖమేనీకి బోష్రా, హోడా అనే ఇద్రు కుమార్తెలు ఉండగా.. వారికి గతంలోనే వివాహాలు జరిగాయి. అలాగే ఖమేనీకి చాలా మంది మనవరాళ్ళు ఉన్నారని కూడా తెలుస్తోంది, అయితే వారి గుర్తింపులు బహిరంగంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా.. బుష్రా, హోదాల్లోని ఓ అమ్మాయి, ఆమె భర్త, కుమార్తె... ఖమేనీతో పాటు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఆయనకు నలుగురు కుమారులు కూడా ఉండగా.. వారంతా కూడా ఇరాన్‌లోనే స్థిరపడ్డారు. కాగా ఆయన మేనల్లుళ్లు, మనవళ్లు కొందరు పారిస్‌లో నివసిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రతీకారానికి సిద్ధమైన ఐఆర్‌జీసీ..
ఖమేనీ మరణం ఇరాన్ పాలకులకు కోలుకోలేని దెబ్బగా నిలుస్తోంది. అమెరికాను నంబర్ వన్ శత్రువుగా పరిగణించిన ఖమేనీ.. తన హయాంలో మిలిటరీ, న్యాయ వ్యవస్థ, మతపరమైన సంస్థలపై పూర్తి పట్టు సాధించారు. కాగా ఈ మెరుపు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఖమేనీ మరణానికి కారణమైన హంతకులను వదిలిపెట్టబోమని ఇరాన్ అత్యున్నత దళం రివల్యూషనరీ గార్డ్స్ ప్రతిజ్ఞ చేసింది.
Latest News