|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:43 PM
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భయంకరంగా మారుతున్నాయి. ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రారంభమైన తర్వాత అమెరికా వైపు నమోదైన తొలి ప్రాణనష్టం ఇదేనని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. అలాగే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం దీనిపై స్పందించారు. సైనికుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే.. యుద్ధం నాలుగైదు వారాల కంటే ఎక్కువగానే కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.
కువైట్ బేస్‌పై క్షిపణి దాడి?
సైనికుల మరణాలు ఎక్కడ జరిగాయనేది సైన్యం అధికారికంగా వెల్లడించనప్పటికీ.. కువైట్‌లోని ఒక సస్టైన్మెంట్ యూనిట్‌పై జరిగిన దాడిలో వీరు మరణించినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలోని బహ్రెయిన్, యూఏఈ, కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ట్రూత్‌ఫుల్ ప్రామిస్ 4 పేరుతో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు సైనికులు గాయపడగా.. మరికొందరు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
సైనికుల మరణంపై ట్రంప్ స్పందన ఇదే..!
సైనికుల మరణంపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ట్రూత్ సోషల్ వేదికగా నివాళులర్పించారు. "మరణించిన వారు నిజమైన అమెరికన్ దేశభక్తులు. దేశం కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి మేము సలాం చేస్తున్నాము. అయితే యుద్ధం ముగిసేలోపు మరిన్ని ప్రాణనష్టాలు జరిగే అవకాశం ఉంది. ఇది చాలా దురదృష్టకరం. కానీ భవిష్యత్తు భద్రత కోసం ఈ యుద్ధం తప్పదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణ మరో 4 నుంచి 5 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
విమాన వాహక నౌకపై దాడి నిజమేనా?
తమ క్షిపణులు అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను తాకాయని ఇరాన్ చేసిన వాదనలను అమెరికా సైన్యం కొట్టిపారేసింది. "ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నౌకకు దరిదాపుల్లోకి కూడా రాలేదు. అవన్నీ పచ్చి అబద్ధాలు" అని సెంట్రమ్ పేర్కొంది. కాగా ప్రస్తుతం అరేబియా సముద్రంలో భారీ ఎత్తున అమెరికా నౌకాదళం మోహరించి ఉంది. వెనిజులాలో నికోలస్ మదురోను బంధించిన అనుభవంతో ఉన్న అమెరికా దళాలకు.. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ఈ ప్రతిఘటన ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే "చరిత్రలోనే అత్యంత తీవ్రమైన దాడి" చేస్తామని హెచ్చరించడం ప్రపంచవ్యాప్త ఆందోళనకు దారితీస్తోంది.
Latest News