|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 05:58 PM
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు శుభవార్త. మక్కాజిపల్లి – ధర్మవరం సెక్షన్‌లో డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ సెక్షన్‌లో 30.04 కి.మీ మేరకు డబ్లింగ్ పనులు పూర్తి అయినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వివరాలతో పాటుగా ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ డబ్లింగ్ పనులు పూర్తి కావటంతో పెనుకొండ - ధర్మవరం మధ్య 42 కిలోమీటర్ల మేరకు డబ్లింగ్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఫలితంగా పెనుకొండ ధర్మవరం మధ్యన ప్రయాణ సమయం తగ్గుతుందని తెలిపింది. ఈ ప్రాంతంలోని చేనేత, పట్టు పరిశ్రమ, సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది.
పెనుకొండ ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా 30.04 కిలోమీటర్ల మేరకు మక్కాజిపల్లి - ధర్మవరం సెక్షన్ డబ్లింగ్ పనులను సౌత్ వెస్టర్న్ రైల్వే చేపట్టింది. డబ్లింగ్ పనులు పూర్తి అయిన నేపథ్యంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇటీవలే తనిఖీ కూడా నిర్వహించారు. గత ఆదివారం ఈ తనిఖీ నిర్వహించారు. ట్రయల్ రన్‌లో భాగంగా 121 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి ట్రాక్ సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ సమయంలో ఆస్కిలేషన్ మానిటరింగ్ సిస్టమ్ లో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు. దీంతో తనిఖీ, ట్రయల్ రన్ ఫలితాల ఆధారంగా, ఈ సెక్షన్‌లో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో రాకపోకలు సాగించేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతి ఇచ్చారు.
మక్కాజిపల్లి - ధర్మవరం సెక్షన్ డబ్లింగ్ పనులు పూర్తి కావటంతో పెనుకొండ- ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 66 చిన్న వంతెనలు, 15 రోడ్ అండర్ బ్రిడ్జిలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఒక స్టేషన్ నిర్మించారు. మరోవైపు డబ్లింగ్ పనులతో పాటుగా మక్కాజిపల్లి నాగసముద్రం మధ్యన ఇంటర్మీడియట్ బ్లాక్ హట్ సైతం ప్రారంభించారు. డబ్లింగ్ ప్రాజెక్టు పనులు పూర్తికావటంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా వాసులకు ప్రయోజనం కలగనుంది. పెనుకొండ , ధర్మవరం మధ్య ప్రయాణ సమయం తగ్గటంతో పాటుగా చేనేత, పట్టుపరిశ్రమ వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెప్తున్నారు.
Latest News