20 లేదా 30 ఏళ్ల వయసుకే డయాబెటిస్,,,, లక్షణాలు, చేయించుకోవాల్సిన పరీక్షలు
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 10:55 PM

ఊబకాయం, తిండి అలవాట్లు, చెడు జీవనశైలి వంటి అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్, ఎండోక్రినాలజీ (ఫోర్టిస్ హాస్పిటల్, కన్నింగ్‌హామ్ రోడ్, బెంగళూరు) తెలిపారు. యువతలో టైప్ -2 డయాబెటిస్ ఎందుకు వస్తుంది, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


డాక్టర్ ఏమంటున్నారు?


యువతలో డయాబెటిస్ పెరగడానికి ప్రధానంగా మారుతున్న జీవనశైలే కారణం. 20, 30 ఏళ్ల వయసున్న యువతలో టైప్ 2 డయాబెటిస్ పెరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి అంశాలు యువతలో టైప్ -2 డయాబెటిస్ పెరగడానికి కారణాలు.


యువతలో డయాబెటిస్ పెరగడానికి ప్రధాన కారణాలు


ఆహారపు అలవాట్లు: అధిక కేలరీలు ఉన్న రుచికరమైన ఆహారం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, తీపి ఎక్కువగా తీసుకోవడం.


శారీరక శ్రమ లేకపోవడం: ఈ రోజుల్లో యువత కూడా బిజీ లైఫ్‌స్టైల్‌ను లీడ్ చేస్తున్నారు. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం, మొబైల్స్, టీవీలకు అతుక్కుపోవడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది. వ్యాయామానికి చాలా మంది యువత దూరంగా ఉంటున్నారు.


నిద్రలేమి: చాలా మంది నిద్ర సరిగ్గా పోవడం లేదు. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, పార్టీ కల్చర్‌తో నిద్రకు దూరంగా ఉండటం చేస్తున్నారు.


ఒత్తిడి: ఈ రోజుల్లో చాలా మంది పని లేదా చదువుల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.


ఇతర ఆరోగ్య సమస్యలు: ఊబకాయం, ఫ్యాటీ లివర్, మహిళల్లో వచ్చే PCOS వంటి సమస్యలు కూడా డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.


గుర్తించాల్సిన లక్షణాలు


ప్రారంభదశలో నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత లక్షణాలు చాలా స్వల్పంగా కనిపిస్తాయి. అందుకే జాగ్రత్తగా గమనించాలి.


ఎక్కువగా దాహం వేయడం


మాటిమాటికీ మూత్ర విసర్జన అవ్వడం.


విపరీతమైన నీరసం, అలసట.


ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం.


మెడ చుట్టూ చర్మం నల్లగా మారడం


గాయం నెమ్మదిగా నయం కావడం


అస్పష్టమైన దృష్టి


చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటిస్‌తో కలిగే ప్రమాదాలు


చిన్న వయసులోనే మధుమేహం రావడం వల్ల అది శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇతర సమస్యలు రావచ్చు.


గుండె జబ్బులు


రక్తపోటు


కిడ్నీ సమస్యలు


నరాల బలహీనత


కంటి చూపు మందగించడం


కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే ఇతర గుండె సంబంధిత వ్యాధులు


అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి?


యువతలో టైప్ 2 డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణం ఇదే. మనం తిన్న ఆహారం చక్కెరగా మారుతుంది. దీనిని కణాలకు పంపడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం.


సమస్య: వ్యాయామం లేకపోవడం, ఊబకాయం వల్ల మన కణాలు ఇన్సులిన్‌కు స్పందించవు. దీనివల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది.


గుర్తు: మెడ వెనుక, చంకల్లో చర్మం మందంగా, నల్లగా మారడం అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు ప్రధాన సంకేతం.


ఆహారంలో చేయాల్సిన మార్పులు


చక్కెర పెరగకుండా ఉండాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి.


1) ఏం తినాలి?


ఫైబర్: పాలిష్ పట్టని బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలు.


ప్రోటీన్: పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లు, చేపలు, పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు.


మంచి కొవ్వులు: బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు.


2) ఏం తినకూడదు?


తెల్లటి పదార్థాలు: మైదా, తెల్ల బియ్యం, పంచదార , వైట్ బ్రెడ్, ఉప్పు తగ్గించాలి.


డ్రింక్స్ : కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్‌లు


బయటి ఆహారం: పిజ్జా, బర్గర్, సమోసా వంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం, వేయించిన ఆహారాలు


వ్యాయామం కూడా ముఖ్యమే


బరువు తగ్గడానికి, ఇన్సులిన్ పనితీరు మెరుగుపర్చడానికి రెండు రకాల వ్యాయామాలు అవసరం.


కార్డియో: రోజుకు 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్.


స్ట్రెంత్ ట్రైనింగ్: వారానికి కనీసం రెండు రోజులు వెయిట్స్ ఎత్తడం లేదా పుష్-అప్స్ వంటివి చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. కండరాలు ఎంత బాగుంటే చక్కెర అంత త్వరగా ఖర్చు అవుతుంది.


ఒత్తిడి నిర్వహణ


మానసిక ఒత్తిడిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. అయితే, ఒత్తిడి నిర్వహణ చాలా ముఖ్యం.


స్ట్రెస్ హార్మోన్లు: మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ విడదలవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే యోగా, ధ్యానం వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.


తగినంత నిద్ర: రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో మెటబాలిజం దెబ్బతింటుంది. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది.


పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి?


కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. లేదా మీ బరువు ఎక్కువగా ఉన్నా.. 25 ఏళ్లు దాటినప్పటి నుంచి ఏడాదికి ఒకసారి కింద పరీక్షలు చేయించుకోవాలి.


HbA1c: గత 3 నెలల సగటు చక్కెర స్థాయి (ఇది 5.7% కంటే తక్కువ ఉండాలి).


Fasting Blood Sugar: పరగడుపున చేసే పరీక్ష.


Lipid Profile: కొలెస్ట్రాల్ స్థాయిల్ని అంచనా వేయడానికి


చివరగా ఏం తెలుసుకోవాలి?


డయాబెటిస్ అనేది కేవలం జబ్బు మాత్రమే కాదు, అది మన జీవనశైలి లోపం. ప్రారంభ దశలో గుర్తిస్తే సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. యువత తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటిస్తే భవిష్యత్తులో వచ్చే పెద్ద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

Latest News
No plans yet to attend next round of talks with US: Iran Mon, Apr 20, 2026, 04:44 PM
Nepal: Govt employees to receive salary on fortnightly basis Mon, Apr 20, 2026, 04:12 PM
Over 6,000 Afghan refugees repatriated from Pakistan in single day Mon, Apr 20, 2026, 04:09 PM
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM