26/11 దాడుల సూత్రధారి తహవూర్ రాణాకు కెనడా షాక్.. పౌరసత్వం రద్దుకు రంగం సిద్ధం
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:39 PM

26/11 ముంబయి ఉగ్రదాడులు ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా పౌరసత్వం రద్దుకు కెనడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ కార్నీ భారత పర్యటనకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జస్టిన్ ట్రూడో హయాంలో భారత్‌తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నాల్లో కెనడా ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25న కార్నీ భారత్‌ పర్యటనకు విచ్చేస్తున్నారు. పాకిస్థాన్‌లో జన్మించిన వ్యాపారవేత్త తహవూర్ రాణా ప్రస్తుతం భారత కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో గతేడాది అతడ్ని ట్రంప్ ప్రభుత్వం అప్పగించింది. ముంబయిలో పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా మారణహోమం వెనుక రాణా హస్తం ఉన్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నవంబరు 26, 2008న జరిగిన ఉగ్రదాడిలో 160 మందికి పైగా మృతి చెందారు.


  వ్యాపారవేత్త అయిన తహవూర్ రాణా 1997లో కెనడాకు వలసవెళ్లగా.. అతడికి 2001లో ఆ దేశ పౌరసత్వం లభించింది. రాణా పౌరసత్వాన్ని రద్దుచేయాలని కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ (IRCC) నిర్ణయానికి వచ్చినట్టు స్థానిక మీడియా నివేదించింది. కానీ, ఉగ్రవాదం ఆరోపణలతో రాణా పౌరసత్వాన్ని రద్దుచేయడం లేదని, తప్పుడు పత్రాలతో పొందినట్టు గుర్తించడంతోనే చర్యలు తీసుకున్నట్టు ఐఆర్సీసీ పేర్కొంది. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో తాను కెనడాలో నివాసం ఉన్నట్టు సమాచారం ఇచ్చాడనేది ఆరోపణ.


IRCC నివేదిక ప్రకారం,..రానా దరఖాస్తు చేసుకోవడానికి ముందు నాలుగేళ్లు ఒట్టావా, టొరంటోలో నివసించానని, ఆ కాలంలో ఆరు రోజులు మాత్రమే దేశం నుంచి బయటకు వెళ్లాలనని పేర్కొన్నాడు. అయితే, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దర్యాప్తులో అతడు ఆ సమయంలో ఎక్కువ రోజులు అమెరికాలో గడిపాడని, అక్కడ అనేక ఆస్తులు, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ, గ్రోసరీ స్టోర్ వంటి వ్యాపారాలను నిర్వహించినట్టు వెల్లడయ్యిందని గ్లోబల్ న్యూస్ నివేదిక తెలిపింది. కెనడాలో లేకపోయినా ఉన్నట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించారు.


అర్హత ప్రమాణాలు లేకున్నా పౌరసత్వం కోసం అధికారులను తప్పుదారి పట్టించినట్టు ఐఆర్సీసీ మార్చి 31, 2024లో రాసిన ఓ లేఖలో పేర్కొంది. ఈ అంశాన్ని ప్రస్తుతం కెనడా ఫెడరల్ కోర్టుకు ఐఆర్సీసీ పంపింది. వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందారా? అని తుది నిర్ణయం తీసుకునే అధికారం కోర్టుకే ఉంది.


అయితే, ఈ రద్దును సవాల్ చేసిన రాణా.. ఈ నిర్ణయం అన్యాయమని, తన హక్కులను ఉల్లంఘించిందని వాదించారు. గతవారం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాదులు సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని నిలిపివేయడానికి అనుమతి కోరారు. అయితే, కెనడా పౌరసత్వ వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇచ్చిన సందర్భాల్లో రద్దు చేయడం సమంజసమేనని ఇమ్మిగ్రేషన్ విభాగం అధికార ప్రతినిధి అన్నారు. ఇటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం అంత తేలికగా తీసుకోదని, ఫెడరల్ కోర్టు ఈ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM