|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 07:52 PM
పొరుగు దేశం నేపాల్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోతైన త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. ధాడింగ్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా..సుమారు 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి వేళ మృత్యుఘోష..
పోఖారా నుంచి రాజధాని కాఠ్మాండూకు వెళ్తున్న ఈ ప్రయాణీకుల బస్సు సోమవారం తెల్లవారుజామున 1.15 నుంచి 1.30 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. పృథ్వీ హైవేపై కాఠ్మాండూకు 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న బెనిఘాట్ రోరాంగ్ రూరల్ మునిసిపాలిటీ పరిధిలోని చీనాధార వద్ద బస్సు అదుపుతప్పి నదిలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.
చీకటి సమయంలో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు చేపట్టడం భద్రతా దళాలకు కష్టతరంగా మారింది. నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులు,స్థానిక ప్రజలు కలిసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో న్యూజిలాండ్‌కు చెందిన ఒక పురుషుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 28 మందిని నదిలో నుంచి ప్రాణాలతో బయటకు తీశారు. వీరిలో జపాన్, డచ్ దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
అతి వేగమే కారణమా?
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక విచారణలో డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడం వల్లే మూలమలుపు వద్ద అదుపుతప్పి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. "బస్సు అతివేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాంకేతిక లోపం ఉందా లేదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం" అని ధాడింగ్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ చీఫ్ శిశిర్ థాపా తెలిపారు.
నేపాల్ రోడ్లపై ఆందోళన
నేపాల్‌లోని కొండ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సరైన రోడ్లు లేకపోవడం, వాహనాల కండిషన్ సరిగా లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రస్తుతం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని మృతదేహాలు నదిలో కొట్టుకుపోయి ఉండవచ్చని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Latest News