|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 07:34 PM
సరిహద్దు దేశం అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన తాజా వైమానిక దాడులను భారత్ తీవ్రస్థాయిలో ఖండించింది. పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుండగా.. సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేయడం అమానుషమని పేర్కొంది. ఈ దాడుల వల్ల చిన్న పిల్లలు, మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారని.. ఇది దారుణం అని స్పషటం చేసింది. అంతేకాకుండా పాకిస్థాన్ తన సొంత దేశంలోని అంతర్గత వైఫల్యాలను, అశాంతిని పక్కదారి పట్టించేందుకే ఇలా ఇతర దేశాలపై దాడులు చేస్తోందని చెప్పుకొచ్చింది.
భారత విదేశాంగ శాఖ ఆగ్రహం..
అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ జరిపిన వైమానిక దాడుల వల్ల మహిళలు, చిన్నారులతో సహా భారీ సంఖ్యలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రంజాన్ వంటి పవిత్ర సమయంలో ఇలాంటి రక్తపాతం జరగడం అత్యంత దురదృష్టకరం" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తోందని భారత్ ఎండగట్టింది.
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌద్రీ ఈ దాడులను సమర్థించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని పాక్ పేర్కొంది. ఈ దాడుల్లో కనీసం 70 నుంచి 80 మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. అయితే మరణించిన వారు ఉగ్రవాదులేనని చెప్పేందుకు పాక్ ఎలాంటి ఆధారాలను లేదా ఫోటోలను చూపించకపోవడం గమనార్హం.
అఫ్గానిస్థాన్ అధికారిక నివేదికల ప్రకారం.. పాక్ యుద్ధ విమానాలు నంగర్‌హార్, పక్తికా ప్రాంతాల్లోని నివాస గృహాలు, పాఠశాలలపై బాంబుల వర్షం కురిపించాయి. మొత్తంగా ఏడు శిబిరాలను నాశనం చేశాయి. అయితే ఈ దాడుల్లో 18 మందికి పైగా సామాన్య పౌరులు మరణించారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. మరణించిన వారందరూ సాధారణ గ్రామీణులని, వారికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధం లేదని స్థానిక గిరిజన పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం పాక్ చర్యను తీవ్రంగా నిరసిస్తూ.. తమ గగనతల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది.
Latest News