|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:16 PM
టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది. శుక్రవారం రోజు అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేశారు. ఇద్దరు వ్యక్తులు కారులో అనంతపురంలోని ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చారు.. అక్కడ ఆగి నిమ్మకాయలు, తెల్ల నువ్వుల్ని ఇంటి ముందు పడేసి కారులో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యే అనుచరులు.. వెంటనే మరో కారులో వారిని వెంబడించారు.. కానీ వారు కారులో వేగంగా వెళ్లిపోవడంతో దొరకలేదు. దుండగులు వచ్చిన కారు నంబరు AP 39 KX 0986గా గుర్తించారు. ఆ కారు గురించి ఆరా తీయగా గుంటూరుకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ పేరుతో రిజిస్టర్ అయ్యిందని గుర్తించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే శ్రావణి నివాసం ఉండే ప్రాంతంలో కొంత కాలంగా ఇలా క్షుద్రపూజలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా క్షుద్రపూజలు ఎవరు చేయిస్తున్నారనే దిశగా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే శ్రావణితో విభేదించేవారు ఎవరైనా ఇలా చేస్తున్నారా అని అనుమానిస్తున్నారు. ఇవాళ ఇలా ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వేయడంపై మరోసారి హాట్‌టాపిక్ అయ్యింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే వర్గీయులు అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దుండగుల్ని పట్టుకోవాలని కోరారు. అయితే పోలీసులు దుండగులు వచ్చిన కారు నంబరు, ఎమ్మెల్యే ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే శ్రావాణి పుట్లూరు మండలం పుట్లూరు చెరువు నుంచి కోమటికుంట్ల చెరువుకు నీటిని విడుదల చేశారు.
అనంతరం గంగమ్మకు పూజలు నిర్వహించి చీర, పసుపు, కుంకుమలను సమర్పించారు. గత నెల 14వ తేదీన సుబ్బరాయ సాగర్ నుంచి పుట్లూరు చెరువుకు నీటిని విడుదల చేయగా.. ప్రస్తుతం పుట్లూరు చెరువులో నీటిమట్టం సుమారు నాలుగు అడుగులుగా ఉంది. పుట్లూరు చెరువుకు మొత్తం 2025 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోమటికుంట్ల చెరువుకు 870 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుబ్బరాయ సాగర్‌లో ప్రస్తుతం లైవ్ స్టాక్ 870 క్యూసెక్కులుగా ఉంది. సుబ్బరాయ సాగర్‌కు ఇన్‌ఫ్లో 175 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 140 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఈ నీటి నిర్వహణ ఏర్పాట్ల ద్వారా కోమటికుంట్ల చెరువుకు దాదాపు ఎనిమిది రోజుల పాటు నిరంతరంగా నీరు అందించనున్నారు. రానున్న రోజుల్లో 5.2 కోట్ల రూపాయలతో ఆధునికరణ పనులు పూర్తవుతాయి అంటున్నారు ఎమ్మెల్యే శ్రావణి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చేస్తున్నారన్నారు.