|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:09 PM
'టీం 11' బృందం కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, బాబాయి హత్యకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రూ.250 కోట్లు దోచుకుని, ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో క్లీన్‌చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో లోకేశ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు అనే విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి. నాయకులు ఎంత ఎదిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు మన దేవాలయం లాంటి టీడీపీ ఆఫీసుకే వస్తారు. పార్టీని బలోపేతం చేసేందుకు మనం అహర్నిశలు కష్టపడాలి" అని చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తుచేశారు.గ్రామస్థాయి నుంచి కాదు, బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. బూత్ స్థాయిలో బలంగా ఉంటేనే టీడీపీ బలంగా ఉంటుంది అని లోకేశ్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల తర్వాత కొన్ని బూత్‌లలో వేవ్ ఉన్నా ఎందుకు గెలవలేకపోయామనే కారణాలను అన్వేషించాలన్నారు. తన అనుభవాన్ని వివరిస్తూ 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదు. 2019లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కలిగిన బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఓడిన చోటే గెలవాలని కార్యకర్తలతో కలిసి బూత్‌ల వారీగా సమీక్షించి, నాలుగేళ్లు తూచా తప్పకుండా పనిచేసి విజయం సాధించాం అని తెలిపారు. సంస్థాగత నిర్మాణంపై నమ్మకంతోనే గెలిచానని, ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఐదు జోన్లలో 4,772 బూత్‌లను బలోపేతం చేసేందుకు 903 మంది సీనియర్ నాయకులను నియమించినట్లు లోకేశ్ వెల్లడించారు.ప్రతి నాయకుడు బూత్‌కు కనీసం ఒక రోజు కేటాయించి, అక్కడి పరిస్థితులను తెలుసుకుని, పార్టీ బలోపేతానికి నివేదిక ఇవ్వాలి. ఇకపై బూత్ పనితీరు ఆధారంగానే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో పదవులు దక్కుతాయి అని ఆయన స్పష్టం చేశారు. పసుపు జెండా కోసం ప్రాణాలు త్యాగం చేసిన అంజిరెడ్డి తాత, మంజుల, చెన్నుపాటి గాంధీ, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని అన్నారు.దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్‌ది. విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నాం. అమరావతి, పోలవరం పనులు వేగవంతం చేశాం. కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని లోకేశ్ తెలిపారు. రూ.4 వేల పింఛను, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం 16 వేల టీచర్ పోస్టుల భర్తీ వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. కనీసం 15 ఏళ్లు కలిసికట్టుగా ముందుకు వెళితేనే అభివృద్ధి సాధ్యమని పవనన్న చెప్పారు. మన కూటమిలో విడాకులు, మిస్ ఫైర్‌లు, క్రాస్ ఫైర్‌లు ఉండవు. ఏవైనా సమస్యలుంటే మూడు పార్టీలు కూర్చొని చర్చించుకుంటాయి. వైసీపీ మన మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది, అందరూ అప్రమత్తంగా ఉండాలి అని లోకేశ్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Latest News