|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:12 PM
AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులను తగ్గిస్తూ, ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.కేవలం నాలుగు టెక్ దిగ్గజాలే భారత బడ్జెట్‌కు దాదాపు సమానమైన పెట్టుబడులను ఏఐ కోసం వెచ్చిస్తున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా ఏఐ బూమ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐతో పాటు దానికి అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కలిపి సుమారు 650 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నాయి. ఇది ఇటీవల ప్రకటించిన భారత కేంద్ర బడ్జెట్ (సుమారు 670 బిలియన్ డాలర్లు)కు దాదాపు సమానం కావడం గమనార్హం.
*AIపై భారీ పెట్టుబడులు : అయితే, ఈ గణాంకాలు టెక్ కంపెనీలు ప్రకటించిన అంచనాలే కావడం గమనించాలి. అవసరాన్ని బట్టి ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశమూ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, భారత్ బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఏఐపై దిగ్గజ కంపెనీలు వెచ్చిస్తున్న పెట్టుబడులు తక్కువేమీ కావు. అమెజాన్ సుమారు 200 బిలియన్ డాలర్లు, గూగుల్ 175–185 బిలియన్ డాలర్లు, మెటా మరియు మైక్రోసాఫ్ట్ తలా 115–135 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ పెట్టుబడులన్నీ ప్రధానంగా డేటా సెంటర్లు, సూపర్‌కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ చిప్‌లు, సర్వర్లు, క్లౌడ్ టెక్నాలజీల అభివృద్ధికి వినియోగించనున్నారు.ఏఐ రంగంలో పైచేయి సాధించిన వారికే రాబోయే కాలంలో టెక్ రంగంలో ఆధిపత్యం ఉంటుందన్న భావనతోనే చాలా కంపెనీలు ఈ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ప్రతి కస్టమర్ అనుభవం ఇప్పుడు ఏఐతో ముడిపడి ఉందని, అందుకే తాము అగ్రెసివ్‌గా పెట్టుబడులు పెడుతున్నామని వెల్లడించారు.
*ఉద్యోగాలను తినేస్తున్న AI :ఇదిలా ఉండగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ రంగంలోని ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏఐ కారణంగా అనేక ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఆంథ్రోపిక్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో గుబులు రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో టెక్కీలను భర్తీ చేసే స్థాయిలో ఏఐ మోడల్స్ రానున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ పరిస్థితుల మధ్యనే అనేక కంపెనీలు లేఆఫ్స్‌కు తెరలేపుతున్నాయి. ఇప్పటివరకు అమెజాన్ సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించగా, మైక్రోసాఫ్ట్ 9,000 మందిని, మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో దాదాపు 10 శాతం సిబ్బందిని తగ్గించింది. రాబోయే కాలంలో ఏఐ ప్రభావంతో మరిన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.