|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 08:28 PM
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యతను నీటి వినియోగదారుల సంఘాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ లేకుండా చూస్తామని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సైతం బిల్లులు చెల్లించే బాధ్యత తమదేనని ఆయన కీలక హామీ ఇచ్చారు. గురువారం అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో సీఎం మాట్లాడారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీటి భద్రత అందరికీ అవసరం కానీ, దాని సంరక్షణపై చాలా మందికి శ్రద్ధ లేదు. పరుగెత్తే నీటిని నిలపాలి నడిచే నీటిని జలాశయంగా మార్చాలి. అప్పుడే భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది అని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 40 జీవనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే కరవు అనే మాటే వినిపించదని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రాన్ని, ఇప్పుడు రైతులకు అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తున్నామని తెలిపారు.సాగునీటి సంఘాలకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తున్నందున, చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చూడాల్సిన బాధ్యత వాటిపైనే ఉందని సీఎం దిశానిర్దేశం చేశారు. నీటి పన్నులు వసూలు చేసుకుని, ఆ నిధులతో కాలువల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చని సూచించారు. రాష్ట్రంలో 6,700 నీటి వినియోగదారుల సంఘాలు, 58 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సరైన సమయంలో నీరందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తూ భూగర్భ జలాల పెంపు, కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణలో సంఘాలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Latest News