|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:59 PM
మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించి 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు, స్థానిక పరిపాలన అధికారులు, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాష్కై ప్రాంతంలోని ఒక బొగ్గు గనిలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు గనిలో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు 16 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కొంతమంది కార్మికులు గనిలో చిక్కుకుని ఉండే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కార్మికులేనని ప్రాథమికంగా గుర్తించారు.ఈ ప్రమాదం థాంగ్ స్కూ ప్రాంతంలో జరిగినట్లు మేఘాలయ పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడు జరిగిన సమయంలో గనిలో ఎంతమంది కార్మికులు ఉన్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా గ్యాస్ లీక్ లేదా సాంకేతిక లోపం కారణంగా పేలుడు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం అసలు కారణాన్ని వెల్లడించనున్నారు.
Latest News