|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:58 PM
ప్రముఖ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ జీవితాన్ని జెఫ్రీ ఎప్‌స్టీన్ వివాదం నీడలా వెంటాడుతూనే ఉంది. ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుండటంతో.. బిల్‌గేట్స్ మరోసారి తన గతాన్ని తలుచుకుని విచారం వ్యక్తం చేశారు. ఆ వివాదాస్పద వ్యక్తితో తాను గడిపిన ప్రతి నిమిషం పట్ల పశ్చాత్తాపం చెందుతున్నానని, బహిరంగంగానే అందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.
అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన లక్షలాది ఇమెయిల్స్, పత్రాలలో .. బిల్ గేట్స్ పేరు కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా జెఫ్రీ ఎప్‌స్టీన్ రాసిన కొన్ని డ్రాఫ్ట్ ఇమెయిల్స్‌లో.. బిల్‌గేట్స్ వివాహేతర సంబంధాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన రష్యన్ యువతులతో గడిపేందుకు తాను సహకరించానని, వివాహిత మహిళలతో రహస్యంగా భేటీ అయ్యేలా ఏర్పాట్లు కూడా చేశానని అందులో చెప్పుకొచ్చారు. అలాగే ఈ రహస్యాలు బయట పడకుండా ఉండేందుకు.. తన భార్య (మిలిండా గేట్స్)కు యాంటీ బయాటిక్స్‌ను కూడా అడిగారని తెలిపారు. అయితే ఈ పరిణామాల తర్వాత తనతో ఉన్న ఆరేళ్ల స్నేహాన్ని గేట్స్ తెంచుకున్నాడని కూడా వివరించారు.
అయితే ఈ ఆరోపణలను బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు. "ఆ ఇమెయిల్ ఎప్పుడూ ఎవరికీ పంపలేదు. అందులోని అంశాలన్నీ పచ్చి అబద్ధాలు. నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికే ఎప్‌స్టీన్ ఇలాంటివి రాసి ఉండవచ్చు" అని గేట్స్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఆ సంబంధాల వల్లే బిల్‌గేట్స్‌కు దూరమయ్యా..
బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఈ తాజా పరిణామాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పత్రాలు బయటకు రావడం తన వైవాహిక జీవితంలోని అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోందని అన్నారు. "నా మాజీ భర్తకు ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలపై నాకు కూడా కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు ఆయన (బిల్ గేట్స్) మాత్రమే సమాధానం చెప్పాలి. నేను కాదు. అలాగే బాధితులు అందరికీ న్యాయం జరగాలి" అని ఆమె పేర్కొన్నారు. అలాగే బిల్‌గేట్స్‌కు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉండడం వల్లే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.
ఎందుకు కలిశారంటే.. గేట్స్ వివరణ ఇదీ..!
జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను మీరు ఎందుకు కలిశారంటూ బిల్ గేట్స్‌ను ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ సమాధానాలు చెప్పారు. 2011లో మొదటి సారి తాను ఎప్‌స్టీన్‌ను కలిశానన్నారు. అయితే మూడేళ్ల కాలంలో కేవలం కొన్నిసార్లు మాత్రమే.. అది కూడా భోజనం చేయడానికే తాను ఆయనతో సమావేశం అయ్యానని చెప్పారు. అలాగే తానెప్పుడూ ఆయన రహస్య దీవులకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్యం కోసం నిధులు సేకరించడంలో ఎప్‌స్టీన్‌కు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని నమ్మి ఆయనతో మాట్లాడానని, కానీ అది ఏమాత్రం ఉపయోగం లేని ఓ ప్రక్రియ అని తనకు తర్వాత అర్థమైందని గేట్స్ వెల్లడించారు.
Latest News