|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:00 PM
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల ఈ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ.. రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించింది. అయితే ఆ రిపోర్ట్‌లో సీబీఐ అధికారులు నెయ్యి కల్తీ అయిన మాట వాస్తవమే కానీ.. అందులో జంతువుల కొవ్వు కలిపారు అనేది అవాస్తవమని తేల్చారు. ఇప్పుడు ఇదే అంశంపై అధికార కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అయింది. సీబీఐ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని.. వైసీపీ నేతలు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలపై తీవ్రంగా మండిపడుతుండగా.. అటు అధికార వర్గం కూడా ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తోంది.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై తాజాగా సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు అసత్యాలు చెప్పినంత మాత్రాన నిజాలు మారిపోతాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. రౌడీయిజం, దౌర్జన్యం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేసిన వైసీపీ.. దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఎదురుదాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అసభ్యంగా తిట్టినా భరించాలా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించిన దోషులను గుర్తించి.. వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సీబీఐ తమకు ఒక రిపోర్ట్ పంపించిందని.. దానిపై ఏకసభ్య కమిషన్ వేసి పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టులో మరింత సమాచారాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
తిరుమల నెయ్యి కల్తీపై 2022లోనే రిపోర్ట్ వచ్చినా అప్పటి ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందని చంద్రబాబు ప్రశ్నించారు. తప్పు అని తెలిసినా దానిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టులో చెబితే దాన్ని అలాగే కొనసాగించారని మండిపడ్డారు. తాను సీఎం అయిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టి శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. దేవుడి వద్ద అపచారం జరిగితే అంతా కలిసి ఖండించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.
Latest News