పర్‌ఫెక్ట్ ఫిగర్ కోసం.. కొవ్వును శరీరంలోకి ఎక్కించుకుంటున్న మహిళలు
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 09:31 PM

అందంగా కనిపించాలనే కోరిక మనుషుల్లో సహజం. కానీ ఆ అందం కోసం అమెరికాలో ఇప్పుడు ఒక వింతైన, విస్మయానికి గురిచేసే ధోరణి మొదలైంది. సాధారణంగా శరీరంలో ఒకచోట ఉన్న కొవ్వును తీసి అవసరమైన చోట ఎక్కించుకోవడం మనం వినే ఉంటాం. కానీ ఇప్పుడు అక్కడి మహిళలు తమ శరీర ఆకృతిని మార్చుకోవడానికి మృతదేహాల నుంచి తీసిన కొవ్వును వాడుతున్నారు. టైగర్ ఎస్థెటిక్స్ అనే సంస్థ అల్లోక్లే అనే బ్రాండ్ పేరుతో ఈ సరికొత్త పద్ధతిని మార్కెట్లోకి తెచ్చింది.


మృతదేహాల కొవ్వుతో అవర్ గ్లాస్ ఆకృతి


తమ శరీరంలో తగినంత కొవ్వు లేని వారు లేదా ఇప్పటికే పలుమార్లు సర్జరీలు చేయించుకున్న వారు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. శాస్త్ర పరిశోధనల కోసం తమ శరీరాలను దానం చేసిన దాతల నుంచి ఈ కొవ్వును సేకరిస్తారు. దీనిని శుద్ధి చేసి, క్రిమిరహితం చేసి, అందులోని డీఎన్ఏ, సజీవ కణాలను తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల వేరే వ్యక్తి కొవ్వును ఎక్కించినప్పుడు శరీరం దానిని తిరస్కరించదు. అమెరికాకు చెందిన ఒక మహిళ ఈ పద్ధతి కోసం దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచింది. చనిపోయిన వారి అవయవాలను ఎలాగైతే ఇతరులకు వాడుతారో.. ఇదీ అలాంటిదేనని చెబుతున్నారు.


 సాంప్రదాయ ప్లాస్టిక్ సర్జరీలతో పోలిస్తే ఈ ప్రక్రియ చాలా సులభం. దీనికి అనస్థీషియా అవసరం లేదు. సర్జరీ తర్వాత కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా ఒజెంపిక్ వంటి బరువు తగ్గే మందులు వాడి, చర్మం వదులుగా మారిన వారు తమ తుంటి భాగాన్ని, రొమ్ములను ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ ఇంజెక్షన్లను తీసుకుంటున్నారు. దీని ధర 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు (సుమారు రూ. 8.5 లక్షల నుంచి రూ. 83 లక్షల వరకు) ఉంటోంది. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ అల్లో క్లే విధానం ఇప్పుడు ధనవంతుల్లో ఒక ఫ్యాషన్‌గా మారింది.


ప్రాణాంతకమైన ముప్పులు పొంచి ఉన్నాయా?


మెడికల్ పరంగా ఈ ప్రక్రియ ఎంత సులభంగా అనిపించినా.. దీని వెనుక భారీ రిస్కులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కించిన కొవ్వు గడ్డలుగా మారి ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చని చెబుతున్నారు. అలాగే కొవ్వు పొరపాటున రక్తనాళాల్లోకి వెళ్తే ప్రాణాపాయం సంభవించవచ్చని వివరిస్తున్నారు. రొమ్ము భాగంలో ఈ కొవ్వును ఎక్కించడం వల్ల భవిష్యత్తులో మెమోగ్రామ్ పరీక్షలు చేసినప్పుడు క్యాన్సర్ గడ్డలను గుర్తించడం కష్టం అవుతుందని కూడా పేర్కొన్నారు.


ముఖ్యంగా ఈ విధానం ప్రస్తుతం వైరల్ అవుతుండడంతో.. చనిపోయిన వ్యక్తుల అవశేషాలను అందం పెంచుకోవడానికి వాడటం ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. తమ దేహాలను వైద్య పరిశోధనల కోసం లేదా ప్రాణాలు రక్షించే చికిత్సల కోసం దానం చేసిన వ్యక్తులు.. తమ కొవ్వు ఇలా ఎవరిదో తుంటిని లేదా రొమ్ములను పెంచడానికి వాడతారని ఊహించి ఉండరని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందం కోసం మృతదేహాలను వాడుకోవడం నైతికంగా తప్పని పలువురు వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు.


Latest News
Owaisi lodges police complaint against Assam CM for 'violent video' Mon, Feb 09, 2026, 04:12 PM
Bomb threats in two Patna courts, probe on Mon, Feb 09, 2026, 03:57 PM
India and Seychelles ink agreements in key sectors, open new vistas for cooperation Mon, Feb 09, 2026, 03:48 PM
Pakistan's trade deficit soars by 44 per cent as exports plunge Mon, Feb 09, 2026, 03:41 PM
T20 WC: Zimbabwe choose to bowl against Oman in campaign opener Mon, Feb 09, 2026, 03:26 PM