|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 08:27 PM
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. లోక్‌సభలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి సక్షిప్తంగా వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారత్‌కు ఎటువంటి సమస్య ఉండదని, ఇది చాలా సురక్షితమైందని ఆయన పేర్కొన్నారు. సుంకాల ఉద్రిక్తతల మధ్య, నెలల తరబడి జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరినట్టు ఆయన తెలిపారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి సున్నితమైన రంగాలకు రక్షణ కల్పించడంలో విజయం సాధించామని గోయల్ స్పష్టత ఇచ్చారు.
రెండు దేశాలు ముఖ్యమైన రంగాలను విస్మరించకుండా జాగ్రత్తలు తీసుకుని, ఒక ఏకాభిప్రాయానికి రావడానికి ఒక సంవత్సరం పట్టిందని గోయల్ చెప్పారు. ‘‘గత సంవత్సరం, రెండు వైపుల నుంచి ప్రతినిధులు వివిధ స్థాయిలలో వివరణాత్మక చర్చలు జరిపారు. రెండు వైపుల ముఖ్యమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, తమ కీలకమైన, సున్నితమైన ప్రాంతాలను కాపాడుకోవాలని, సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను నిర్ధారించుకోవాలని కోరుకోవడం సహజం... చర్చల సమయంలో, భారత్ తన సున్నితమైన రంగాల ప్రయోజనాలను, ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమను కాపాడుకోవడంలో విజయవంతమైంది... ఏడాది పాటు జరిగిన చర్చలతో, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వివిధ రంగాలకు తుది రూపాన్ని ఇవ్వడంలో ఇరు పక్షాలు విజయం సాధించాయి’’ అని కేంద్ర వాణిజ్య మంత్రి పేర్కొన్నారు.
వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడింది. కానీ, ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా మంత్రులు చేస్తున్న ప్రకటనలు మాత్రం.. కేంద్రం చెప్పేదానికి భిన్నంగా ఉన్నాయి. తమ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి భారత్ అంగీకరించినట్టు ట్రంప్ యంత్రాంగం చెప్పడం గమనార్హం. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో చేసిన ప్రకటనలకు ఎటువంటి పొంతనలేదు. మాస్కో నుంచి క్రూడాయిల్ దిగుమతులు ఆపేస్తామని భారత్ చెప్పిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ, రష్యా మాత్రం మా నుంచి చమురు కొనుగోలు నిలివేస్తామని ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని ప్రకటన చేసింది. ఆంక్షలను ఉల్లంఘించి రష్యా చమురు కొనుగోలు చేస్తుందనే వంకతోనే భారత్‌పై అమెరికా సుంకాలను 50 శాతానికి పెంచింది. వాణిజ్య ఒస్పందం కుదరడంతో ఆ సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అంతేకాదు, తమ వస్తువులపై భారత్ సున్నా సుంకాలను వసూలు చేయనుందని పేర్కొన్నారు.
Latest News