|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:27 PM
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం రద్దు కావడానికి దారితీసిన లోక్‌సభలోని గందరగోళం బుధవారం ఉదయమే ప్రారంభమైంది. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే ఆత్మకథలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. పలుసార్లు వాయిదాల అనంతరం సాయంత్రం 5 గంటలకు మళ్లీ సభ ప్రారంభమైంది. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని భావిస్తున్న కొద్దిసేపటి ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్షా గైక్వాడ్, జ్యోతిమణి సహా ప్రతిపక్షానికి చెందిన కొందరు మహిళా ఎంపీలు ప్రధాని మోదీతో పాటు అధికార పార్టీ సభ్యుల సీట్లను చుట్టుముట్టారు.
‘డూ వాట్ ఈజ్ రైట్’ అని రాసి ఉన్న ఒక పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. మంగళవారం ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారు నిరసనకు దిగారు. ఇది సభలో గందరగోళానికి దారితీయడంతో ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న సంధ్య రాయ్ వాయిదా వేశారు. తమ సీట్ల నుంచి వెళ్ళిపోవాలని పలువురు మంత్రులు కోరిన తర్వాతే ఆ మహిళా ఎంపీలు తమ నిరసన ముగించారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రతిపక్ష మహిళా ఎంపీలు దాడిచేయాలని భావించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.
‘సభలో ఈ రోజు ఏదైతే జరిగిందో అది తీవ్ర భయానకమైంది.. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నిస్సహాయత స్థాయిని మాత్రమే చూపుతుంది.. పక్కా ప్రణాళికతోనే మహిళా ఎంపీలు ప్రదాని నరేంద్ర మోదీ సీటును చుట్టుముట్టారు.. కిరణ్ రిజిజు తక్షణమే జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది’ అని ఆయన తెలిపారు.
వాయిదాల తర్వాత సభ మధ్యాహ్నం ప్రారంభం కాగానే.. 2020లో చైనాతో సరిహద్దుల్లో జరిగిన ప్రతిష్టంభన అంశంపై ప్రతిపక్ష సభ్యులు లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య సభను మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగం రద్దయ్యింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభ ఇంకా ఆమోదం తెలపలేదు. సభను రేపటి వరకు వాయిదా వేశారు, కాబట్టి చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇక, కాంగ్రెస్, సీపీఐకి చెందిన 8 మంది ఎంపీలను ఈ సెషన్ ముగిసేవరకూ సస్పెండ్ చేస్తూ మంగళవారం నాడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం ఉదయం పార్లమెంట్ ముఖద్వారం వద్ద నిరసనకు దిగాయి.