|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:21 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో పోర్టులపై ఫోకస్ పెట్టింది. కొన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉండగా.. మరికొన్ని భూసేకరణ దశలో ఉన్నాయి. తాజాగా మరో కొత్త పోర్టుకు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, నేషనల్ మెగా నౌకానిర్మాణ క్లస్టర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ ఫీజిబులిటీ నివేదికను రైట్స్ అనే సంస్థ సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించిందని.. త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి అవసరమైన టెక్నికల్ సహకారాన్ని విశాఖపట్నం పోర్టు అథారిటీ అందిస్తుందని చెబుతున్నారు.
కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేస్తారు. కేంద్రం బడ్జెట్‌లో మారిటైంకు సంబంధించి బడ్జెట్‌లో రూ.1,765 కోట్లు కేటాయించగా.. వీటి నుంచి ఎక్కువ వాటా దుగరాజపట్నం ప్రాజెక్టుకు వస్తుంది అంటున్నారు. దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు- షిప్ బిల్డింగ్ క్లస్టర్ కోసం భూముల్ని సేకరించనున్నారు. దీని కోసం 2,170.70 ఎకరాల భూమి కావాలని ఇటీవల నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా తిరుపతి జిల్లాలో 1,995.04 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 175.66 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది.
తిరుపతి జిల్లాలోని వలమేడులో అత్యధికంగా 724 ఎకరాలు, ఆ తర్వాత వగర్రులో 529 ఎకరాలు, పామంజిలో 489 ఎకరాలు, పాతేటిపాలెంలో 251 ఎకరాలు సేరించాలని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కోట మండలంలోని పుచ్చలపల్లిలో 129 ఎకరాలు, కొత్తపట్నంలో 46 ఎకరాలు సేకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.544.30 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు.
రాష్ట్రవ విభజన సమయంలో చట్టం ప్రకారం పోర్టుకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు దుగరాజపట్నం పోర్టు ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు రూ.30వేల కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏటా ఏకంగా 5లక్షల టన్నుల సరకు రవాణా చేయొచ్చు.. పోర్టుతో పాటుగా షిప్‌యార్డు, నౌకానిర్మాణంతో పాటుగా మరమ్మతుల వ్యవస్థ కూడా చేయొచ్చు. ఈ ప్రాజెక్టును మారిటైం బోర్డు, వీపీఏ (విశాఖపట్నం పోర్టు అథారిటీ) కలిసి అభివృద్ధి చేస్తాయి. వాస్తవానికి దుగరాజుపట్నం పోర్టు ప్రతిపాదనలు ఎన్నో ఏళ్లుగా ఉంది.. కానీ పేపర్ల వరకే పరిమితం అయ్యింది. ఇప్పుడు కేంద్రం సహకారంతో ఏపీ ప్రభుత్వం భూసేకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుపతి, నెల్లూరు జిల్లాల రూపురేఖలు మారిపోతాయి అంటున్నారు.
Latest News