2047 మిషన్ లక్ష్యాల మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టామన్న మోదీ
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:37 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ బడ్జెట్‌ను 'అద్భుత అవకాశాల రహదారి'గా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశం ప్రయాణిస్తున్న 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్'కు కొత్త శక్తి, ఊపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన అన్నారు.ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైనదని, ఇది భారత 'నారీ శక్తి'కి బలమైన ప్రతిబింబమని ప్రధాని అన్నారు.మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు అని ఆయన కొనియాడారు. ప్రస్తుత కలలను వాస్తవంగా మార్చి, 2047 నాటికి వికసిత భారత్ సంకల్పాన్ని సాధించే దిశగా దేశం వేగంగా దూసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుందని మోదీ తెలిపారు. ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకమైనది. అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే, ద్రవ్య లోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంపై దృష్టి సారిస్తుంది. కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండటంతోనే 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందరు, త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆయన స్పష్టం చేశారు.ఈ బడ్జెట్ 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' మిషన్లను వేగవంతం చేయడానికి సాహసోపేతమైన దార్శనికతను అందించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొత్త, సన్‌రైజ్ రంగాలకు అపూర్వమైన మద్దతు లభించిందన్నారు. "బయో-ఫార్మా శక్తి మిషన్, సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ పథకం, రేర్ ఎర్త్ కారిడార్ల అభివృద్ధి, కీలక ఖనిజాలపై దృష్టి, టెక్స్‌టైల్ రంగానికి కొత్త పథకాలు, హై-టెక్, టెక్-ఆధారిత తయారీని ప్రోత్సహించడం వంటివి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎదగడానికి కొత్త బలాన్ని అందిస్తాయి" అని ఆయన వివరించారు.మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో కీలక చర్యలు తీసుకున్నారని ప్రధాని తెలిపారు. ప్రత్యేకించి సరుకు రవాణా కారిడార్లు, హై-స్పీడ్ రైల్ కారిడార్లు, టైర్-2, టైర్-3 నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, నగరాలకు బలమైన ఆర్థిక పునాదిని అందించడానికి మున్సిపల్ బాండ్లను ప్రోత్సహించడం వంటి చర్యలన్నీ వికసిత భారత్ వృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేస్తాయని ఆయన అన్నారు.ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పినట్లుగా, ఇది 'యువశక్తి బడ్జెట్' అని మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌లోని కేటాయింపులు వివిధ రంగాలలో నాయకులను, ఆవిష్కర్తలను, సృష్టికర్తలను తయారు చేస్తాయని తెలిపారు. మెడికల్ హబ్‌ల నిర్మాణం, ఏవీజీసీ రంగాల ప్రోత్సాహం, పర్యాటకం, ఖేలో ఇండియా మిషన్ ద్వారా యువత రాణించడానికి, నాయకత్వం వహించడానికి మార్గాలను తెరుస్తుందన్నారు. "భారతదేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా మార్చడానికి పెద్ద పన్ను మినహాయింపు ప్రకటించాం. ఇది ఉపాధి కల్పనను గణనీయంగా పెంచుతుంది" అని పేర్కొంటూ యువతను ప్రత్యేకంగా అభినందించారు.మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాల కోసం ఆధునిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని మోదీ వెల్లడించారు. బాలికల విద్యను సులభతరం చేసేందుకు ప్రతి జిల్లాలో కొత్త హాస్టళ్లు నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ వ్యవసాయం, మత్స్య రంగానికి ప్రాధాన్యత ఇస్తుందని, కొబ్బరి, జీడిపప్పు, కోకో, గంధపు చెక్కల రైతులకు మద్దతుగా కీలక చర్యలు ఉన్నాయని తెలిపారు. 'భారత్ విస్తార్ ఏఐ టూల్' రైతులకు వారి సొంత భాషలో సమాచారం అందించడంలో ఎంతగానో సహాయపడుతుందని అన్నారు.మొత్తం మీద ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గ్రామస్తులు, పేదలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ఈ భవిష్యత్, సమ్మిళిత బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందాన్ని మరోసారి అభినందించారు.


 

Latest News
Arsenal reach Carabao Cup final after last-gasp Havertz goal Wed, Feb 04, 2026, 12:53 PM
US Senators accuse UBS of blocking Holocaust truth Wed, Feb 04, 2026, 12:48 PM
CM Mamata files fresh plea in SC to stop voter name deletions during SIR in Bengal Wed, Feb 04, 2026, 12:37 PM
TN records over one lakh new cancer cases in 2025; Chennai reports highest count Wed, Feb 04, 2026, 12:28 PM
Trump calls for federal role in US elections Wed, Feb 04, 2026, 12:23 PM