గీతంపై విషం కక్కుతున్నారు అంటూ జగన్‌పై టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఆగ్రహం
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 02:56 PM

గీతం విద్యాసంస్థల భూములకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన ఆరోపణలపై విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఎం. శ్రీభరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాస్తవాలను వక్రీకరించి జగన్, ఆయన పార్టీ నేతలు, మీడియా సంస్థలు గీతంపైనా, తనపైనా విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి నిరాధారమైన, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం విచారకరమని పేర్కొంటూ, వాస్తవాలతో సహా జగన్‌కు బహిరంగ లేఖ ద్వారా గట్టి సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం గీతానికి కేటాయించాలని ప్రతిపాదించిన 54.79 ఎకరాల భూమి విలువ రూ.5000 కోట్లు ఉంటుందని వైసీపీ చేస్తున్న ఆరోపణను శ్రీభరత్ ఖండించారు. దీనిపై ఆయన లెక్కలతో సహా వివరణ ఇచ్చారు. గీతం రుషికొండ క్యాంపస్‌ను ఆనుకుని ఉన్న రాజీవ్ స్వగృహ హౌసింగ్ స్థలంలో 35 ఎకరాలు ఉండేది. మీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ భూమిని నివాసయోగ్యం నుంచి మిశ్రమ వినియోగానికి మార్చారు. ఆ తర్వాత 1000 నుంచి 3000 చదరపు గజాల ప్లాట్లుగా చేసి వేలం వేశారు. 2022 నుంచి మే 2024 వరకు, చదరపు గజానికి కేవలం రూ.60-65 వేల రిజర్వ్ ధరకే ఆ భూములను విక్రయించారు. ఒక ఎకరాకు సుమారు 3000 చదరపు గజాల ప్లాటింగ్ వస్తుంది. ఈ లెక్కన ఎకరా విలువ రూ.19.5 కోట్లు  అవుతుంది. అలాంటప్పుడు 54.79 ఎకరాల మొత్తం విలువ సుమారు రూ.1000 కోట్లు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు చెబుతున్నట్టు మా ఎన్డీయే ప్రభుత్వంలో భూమి విలువ 5 రెట్లు పెరిగిందని అంటున్నారా ఇంత తక్కువ సమయంలో ఏపీలో, విశాఖలో జరిగిన అభివృద్ధికి ఇంతకంటే పెద్ద ప్రశంస ఉండదు. దయచేసి మీ వైఖరి ఏమిటో తేల్చుకోండి అని శ్రీభరత్ జగన్‌ను నిలదీశారు.భూముల విలువపై మాట్లాడుతున్న జగన్, తన హయాంలో జరిగిన కేటాయింపులను గుర్తుంచుకోవాలని శ్రీభరత్ హితవు పలికారు.గీతం క్యాంపస్‌కు కిలోమీటరు దూరంలోనే ఉన్న ఒక అంతర్జాతీయ పాఠశాల  కు మీ ప్రభుత్వం 2023లో ఎకరా కేవలం రూ.1 కోటి చొప్పున 11 ఎకరాలు ఇవ్వలేదా భూమి విలువ నిజంగా ఎకరాకు రూ.100 కోట్లు ఉంటే, అంత తక్కువ ధరకు ఎలా కేటాయించారు మీ లెక్కల ప్రకారమే, రూ.1,100 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.11 కోట్లకు ఎందుకిచ్చారు మేము ఆ నిర్ణయాన్ని స్వాగతించాం, కానీ మూడేళ్లు గడుస్తున్నా అక్కడ ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. దీనిపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను ఇప్పుడు గీతానికి ఉచితంగా కట్టబెడుతున్నారన్న ఆరోపణలోనూ వాస్తవం లేదని శ్రీభరత్ స్పష్టం చేశారు. జీవీఎంసీ జారీ చేసిన ఎన్ఓసీకి భూమి ధర నిర్ణయంలో ఎలాంటి పాత్ర ఉండదని, అది భూమి కేటాయింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు కాదని వివరించారు. ఈ ఫైల్ సీసీఎల్‌ఏకు, ఆ తర్వాత కేబినెట్‌కు వెళ్లిన తర్వాతే ఎంత భూమి, ఏ ధరకు కేటాయించాలనే తుది నిర్ణయం జరుగుతుందని తెలిపారు.గత 20 ఏళ్లుగా చెబుతున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించడానికి గీతం సిద్ధంగా ఉంది. మేం ఏదీ ఉచితంగా అడగడం లేదు. ఈ విషయం మీకు తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని జగన్‌పై మండిపడ్డారు.సమాజానికి సేవ చేస్తున్న సంస్థలపై దయచేసి ఇలాంటి దాడులు చేయవద్దు. ఒకవేళ గీతం కేవలం 'రియల్ ఎస్టేట్ వ్యాపారం' అయితే, కరోనా మహమ్మారి సమయంలో మీ వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని ఇతర ఆసుపత్రులన్నింటినీ కాదని, గీతం ఆసుపత్రి  జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా ఎందుకు ప్రకటించింది ఆ రెండు వేవ్‌లలో 3000 మందికి పైగా రోగులకు సేవ చేశాం. ఆ విశ్వాసం ఇప్పుడు ఏమైంది అని శ్రీభరత్ ప్రశ్నించారు. 2020లో అర్ధరాత్రి తమ ప్రహరీ గోడను కూల్చిన ఘటనను గుర్తుచేస్తూ, కనీసం ఇప్పటికైనా విశ్వవిద్యాలయంపై కక్ష సాధింపు మానుకోవాలని హితవు పలికారు.

Latest News
US Congress presses for stricter AI workplace rules Wed, Feb 04, 2026, 11:23 AM
LS adjourned till noon amid constant sloganeering from Oppn MPs Wed, Feb 04, 2026, 11:18 AM
CM Mamata Banerjee reaches SC for Bengal SIR hearing Wed, Feb 04, 2026, 10:52 AM
Dense fog grips Delhi; low visibility procedures in place at IGI Airport Wed, Feb 04, 2026, 10:43 AM
FC Barcelona ease past Albacete to reach Copa del Rey SF Wed, Feb 04, 2026, 10:40 AM