|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:22 PM
ఏపీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మంత్రికి మరో మంత్రి వినతి పత్రం సమర్పించారు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. సాధారణంగా ప్రజలు, రాజకీయ నేతలకు, ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూ ఉంటారు. తమ ప్రాంతంలోని సమస్యలను ఏకరవు పెడుతూ.. వాటిని పరిష్కరించాలంటూ వినతి పత్రాలు, విజ్ఞాపనలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ మంత్రి.. మరో మంత్రికి వినతి పత్రం సమర్పించడం విశేషం. ఇక అసలు విషయానికి వస్తే..
ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ విలువలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ ఫీజులు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో భూముల మార్కెట్ విలువ పెంపు ప్రతిపాదనలను రాయచోటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఆపివేయాలంటూ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కోరారు. రాయచోటి ప్రాంతవాసులు, రియల్ ఎస్టేట్ రంగం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని నిలిపివేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. అనగాని సత్య ప్రసాద్‌ను కోరారు. సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతిపై అనగాని సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
మరోవైపు ఈ భేటీ సందర్భంగానే రాయచోటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండిపల్లి.. మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉన్న సమయంలో.. భూముల మార్కెట్ విలువను భారీగా పెంచిన సంగతిని గుర్తు చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవల రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చిన విషయం తెలిసిందే. అయితే జిల్లా కేంద్రం మార్చిన నేపథ్యంలో పాత మార్కెట్ విలువను కొనసాగిస్తే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని మండిపల్లి వివరించారు. వాస్తవ మార్కెట్ ధరల కంటే ప్రభుత్వ మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిందని వివరించారు.
ఈ నేపథ్యంలో భూముల మార్కెట్ విలువల పెంపు నుంచి రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిని మినహాయించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. ప్రస్తుతం అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలంగా స్పందించారు. రాయచోటి ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్నామన్న మంత్రి అనగాని.. రిజిస్ట్రేషన్ ధరల పెంపు అంశాన్ని పునఃసమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లికి హామీ ఇచ్చారు. రాయచోటి ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Latest News