|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:12 PM
ఏపీ రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగింది. అరవ శ్రీధర్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు చేసిన మహిళ చెప్తున్నారు. బాధితురాలు బుధవారం రోజున మీడియా ముందుకు వచ్చారు. న్యాయవాదులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆమె చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ కోసం సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లెకు వచ్చినప్పుడు.. తాను చంద్రబాబును కలిసినట్లు ఆ మహిళ చెప్పారు. అరవ శ్రీధర్ అంశంపై అర్జీ ఇచ్చానని.. అయితే ఆయన అందరి నుంచి అర్జీ తీసుకున్నట్లే తన నుంచి కూడా అర్జీ తీసుకుని గ్రీవెన్స్ నంబర్ ఇచ్చారని తెలిపారు.
" అరవ శ్రీధర్‌ను ఎమ్మెల్యేగా నిలబెట్టిన ముక్కా రూపానందరెడ్డిని కలిసి మాట్లడానికి వెళ్లా. వారెవరూ నాతో మాట్లాడటానికి సిద్ధంగా లేరు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా కంప్లైంట్ తీసుకోలేదు. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే.. అరవ శ్రీధర్ అమ్మ నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నానంటూ నా మీదే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. నాతో మాట్లడానికి అరవ శ్రీధర్ వాళ్ల అమ్మానాన్న ఎవరూ సిద్ధంగా లేరు. సంక్రాంతికి చంద్రబాబు గారు నారావారిపల్లెకు వచ్చారు. ఎస్పీ ఆఫీసులో కంప్లెంట్ తీసుకోవడం లేదని చంద్రబాబు గారికి నేరుగా అర్జీ ఇచ్చా. అక్కడ అందరి దగ్గరా అర్జీ తీసుకున్నట్లే.. నా వద్ద కూడా అర్జీ తీసుకుని గ్రీవెన్స్ నంబర్ ఇచ్చారు." అని మహిళ చెప్పుకొచ్చారు.
అరవ శ్రీధర్ రియాక్షన్
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగిని అయిన మహిళ తనపై చేసిన ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ర్పచారం చేస్తున్నారని అరవ శ్రీధర్ చెప్పుకొచ్చారు. మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవాలంటూ ఖండించారు.
2021 నుంచి మూడు సంవత్సరాలు తాను సర్పంచ్‌గా ఉన్నానని.. ఆ సమయంలో తనపై ఎప్పుడూ కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు. ఆరు నెలలుగా మహిళ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని.. దీనిపై తన తల్లి కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా ముందుకు వెళ్తానని అరవ శ్రీధర్ వెల్లడించారు.
Latest News